వేదాలకు మూలమైనటువంటి పరమేశ్వరుని అంశతో జన్మించినవారు,
అఖిలలోకపాలకసుశక్తి సంపన్నులు “శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి”.
నిత్యబ్రహ్మచారిగా ఈయన, తన జీవితం తొలిదశలో, కవీశ్వరునిగా ప్రాశస్త్యం గడించారు.
మలిదశలో దైవాంశసంభూతులుగా భక్తకోటి ఆరాధ్యదైవంగా నిలిచారు.
పదహారేళ్ళప్రాయంలో మొదలైన ప్రస్థానం, కవిగా మానవజీవిత
విశేషణాన్ని, మానవజన్మ ఆవశ్యకతను, జీవి పరమార్థాన్ని, జనులకు తన తత్వబోధనలు,
పద్యపద్మాల ద్వారా ఈ విశ్వానికి సత్యమార్గాన్ని నిర్దేశించిన కవిబ్రహ్మ శ్రీ
వేములవాడ భీమకవి.
ద్రాక్షారామ భీమేశ్వరుడి వరప్రసాదంగా శాపవిమోచన శక్తిని
పొంది, తన పదవాక్కులతోటి అక్షరాలను రెక్కలుగా మార్చి, విశ్వవిహారం చేసిన కవియోగి
శ్రీ వేములవాడ భీమకవి.
వాగ్బాణము, వాక్చాతుర్యము కలిగి, తన అమోఘవాక్కులతో
పాదాశ్రితులకు, ఆరాధకులకు ఆశీర్వచనాలను, వరాలను గుప్పించే నిత్యశుభకరుడు, అఖిలైశ్వర్యప్రదాయకుడు
శ్రీ వేములవాడ భీమకవి.
కవిగా ఉద్దండకవితావాగ్ధురీణుడై, ఎందరో ప్రభువులను,
రాజ్యాధినేతలను తన మృదుమధురపద పద్యపరిమళాలతో రంజింపచేస్తూ, వారికి కొండంత అండగా
నిలిచి, నిరంతర సత్యాన్వేషణ విచక్షణుడై, పరిపాలనాదక్షతలో వారికి మార్గోపదేశం చేసిన
రాజగురువు, పరిపాలక ప్రవీణదర్శుడు
శ్రీ వేములవాడ భీమకవి.
ఇంతటి గొప్ప మహోన్నతశక్తిభూషణుడు, మహోజ్వలచరితుడి చాటుపద్యాల
తేటతెలుగు తీయదనాన్ని నలుగురికీ అందచేయాలని ఆకాంక్షిస్తూ...
భీమకవిని
అందరు నిగ్రహానుగ్రహ సమర్థుడని పిలుస్తారు. ఇదే విషయాన్ని మలకపల్లి పెదశేషయ్య గారు
“ఉద్దండకవి వేములవాడ భీమకవి చరిత్ర”లో ఇలా
వివరించారు.
సీ తిట్టినతిట్టు
మొత్తిన పిడ్గు కై వడి
నతి
భయంకరముగా నడచి కొట్టు
కరుణించి దీవింపఁ గైలాసపతి మెచ్చి
యిచ్చిన
వరముగా నెసక మెసగు
శాపంబు వెట్టిన సద్యోవినిర్భిన్న
భక్ష్యభాండమురీతి
బయలఁబడును
క్రమ్మఱించిన శాప కాండంబు లెల్లను
వడిఁబటా
పంచలై యడగిపోవు
నిగ్రహానుగ్రహ విలాస నియతమాన
మానసోల్లాసవర్తి సంపత్ప్రపూర్తి
ఘనుడు వేములవాడ
భీమన కవీంద్ర
చరిత మానందదాయియై
వరలుఁగాత
భావము:
తిట్టిన తిట్టు, గట్టిగా కొట్టే పిడుగు కన్నా వేగముగా చాలా భయంకరముగా వచ్చి
తాకుతుంది. అదే కరుణించి దీవించినపుడు, స్వయానా కైలాసపతైన ఆ పరమేశ్వరుడే
ప్రసన్నుడై ఇచ్చిన విధంగా వరాలను గుప్పిస్తారు. శాపము పెట్టిన తక్షణం వికటించిన
ఆహారములాగా తీవ్రప్రభావము చూపిస్తూ బయట పడుతుంది. ఉపసంహరించినపుడు, శాపప్రభావమంతా
సమూలంగా, వేగంగా పటాపంచలై నశించిపోతుంది. నిరంతరము నిగ్రహ, అనుగ్రహములతో తనలీలలను
చూపుతూ, ఎల్లపుడూ ఆనందమైనదాయకమైన మనసుతో ప్రకాశించేవాడు. సంపదలోసగేవాడు. గొప్పవాడు
అయిన వేములవాడ భీమకవీంద్రుని చరిత్ర అందరికీ ఆనందమును ప్రసాదిస్తూ ప్రకాశించును
గాక!
సీ. శ్రీకరంబై ధరఁ జెలువుఁగాంచినయట్టి
వెసఁజని
యాతని వ్రేయనుంకించిన
భీమపురంబునఁ బ్రేమమీఱ
భీమేశ్వరుడు దయ పెద్దగలిగి
భీమేశ్వరుండునుఁ బ్రియముతో భక్తుల
ప్రత్యక్షమైవత్స! రమ్మని తగఁజేరి
కోర్కులొసంగుచుఁ గొమరు మిగుల
పశుపక్షి మృగములఁ బ్రాణికోట్ల
నొకనాఁడు తత్ఫురి యువతులుఁ గొందఱు
గలిగించు శక్తియుఁ
గరమొప్ప జనులకు
భక్తి భీమేశ్వరు భవనమునకుఁ
బిడ్డల నాయువుఁ బెంపుదనర
బోయి పుత్రులవేఁడ ముగ్ధత్వముననొక్క
సంపదలొసగెడు సామర్థ్యమునునిడి
విధవ కుమారుని వేడ్కఁగోర
కానిది యౌనని యైనదెల్ల
నాలేమ ముగ్ధత కపహసించుచు నల
గాదనినట్టులఁ గావించు
బలమును
భీమేశ్వరుడు పుత్రుఁ బ్రీతి నొసఁగ
మునురాఁ గలుగునదియునుఁ దెలుపఁగఁ
నా కాంత గర్భిణియై కాంచెఁ దనయునిఁ
బ్రావీణ్యమునునిచ్చి
ప్రబలుము నీవని
గలియుగాదిని బ్రేమ గడలు కొనగఁ
వరమిచ్చెఁ బదియాఱు వర్షములకు
బ్రభవ వర్షంబున శ్రావణమాసంపు
నాతనికి సహాయమై సరస్వతియును
శుక్లపక్షంబున శోభనంబు
********
మీఱఁ బంచమి శుక్రవారంబునను హస్త
నతడెట్లు చెప్పిననట్ల చేయుచునుండె
యందుఁ గన్యాలగ్నమందు వెలయ
సరిలేని కీర్తిచే జగతి వెలసి
వెలివెట్టి రక్కాంత విధవయై పుత్రుని యతడు చెప్పిన శాస్త్రమం దధిక
భక్తి
గాంచెనటంచును గడమజనము
కలిగి నిజమని తలచినఁ గలుగు శుభము
లంతఁ దత్తనయుండు నైదేండ్ల బాలుడై కోర్కెలెల్లను ఫలియించు గురుతరముగ
పురి బాలకుల తోడఁ బొసగనాడ సకల జనులకుఁ దప్పదు జగతిలోన
జనులెల్ల గోళకుండని నిందఁజేసిన
రోషించి యాతండు దూషితయని
ఱాయెత్తి తన తల్లి నేయఁ బోయిన యది
భీమేశ్వరుడు తండ్రి వ్రేయమనిన
శ్రీ వేములవాడ భీమకవి చాటువులు
ఉ రామునమోఘ బాణమును రాజశిఖామణి కంటిమంటయుఁ
దామరచూలి వ్రాతయును దారక విద్విషు ఘోరశక్తియున్
భీముగదావిజృంభణము వెన్నుని చక్రము వజ్రి వజ్రమున్
వేములవాడ భీమకవి భీషణ వాక్యము రిత్తవోవునే
దామరచూలి వ్రాతయును దారక విద్విషు ఘోరశక్తియున్
భీముగదావిజృంభణము వెన్నుని చక్రము వజ్రి వజ్రమున్
వేములవాడ భీమకవి భీషణ వాక్యము రిత్తవోవునే
భావము: రాముని బాణము, శివుని కంటి మంట, బ్రహ్మ తలరాత, తారకాసురున్ని వధించిన సుబ్రహ్మణ్యేశ్వరుని భయంకరమైన “శక్తి” అస్త్రము, భీముని గదా విజృంభణము, విష్ణుమూర్తి చక్రము, ఇంద్రుని వజ్రాయుధం ఎలా తిరుగులేనివో, ఎలా అప్రతిహతాలో, అనివార్యాలో అలాగే వేములవాడ భీమకవి పలుకులు కూడా అంతే తిరుగులేనివి. అంతే శక్తి వంతమైనవి.
ఏ తప్పు చేయని భీమన్న తల్లి మాచెమ్మను, బ్రాహ్మణ కులము నుండీ
వెళివేసి భీమన్నను భోజనవరుసలో నుంచి పంపివేసినపుడు వారికి బుద్ధి చెప్పుటకు
చెప్పిన పద్యము
ఉ. “గొప్పలు
సెప్పుకొంచు ననుఁ గూటికి బంక్తికి రాకుమంచు నీ
త్రిప్పుడు బాపలందఱునుఁ దిట్టిరిఁ గావున నొక్కమాఱ మీ
యప్పములన్ని కప్పలయి యన్నము సున్నముఁ గాగ మాఱుచున్
బప్పును శాకముల్ పులుసు బచ్చడులుఁ జిఱురాలుగావుతన్”
భావము: ఈ పనికి
రాని బ్రాహ్మణులు తాము (సత్బ్రాహ్మణులమని)
గొప్పలు చెప్పుకుంటూ, నన్ను భోజనమునకు రావద్దని ఈ
బ్రాహ్మణులందరూ తిట్టారు. అందుకుగాను ఒక్కసారి మీ అప్పడాలన్నీ కప్పలుగా, అన్నము అంతా
సున్నముగా మారి, పప్పు, కూరలు, పులుసు, పచ్చడులు చిన్నచిన్న రాళ్ళుగా అవ్వుగాక!
వారు
భీమన్న సాక్షాత్తు భీమేశ్వరుని వరపుత్రుడని తెలుసుకున్నాక వారిని అనుగ్రహిస్తూ
చెప్పిన పద్యము
మ. "ఘనుడౌ వేములవాడ వంశజుడు ద్రాక్షారామభీమేశ
నం
దనుఁడీ భీమన యంచు గుఱ్తెఱింగి, నిందల్ మానినన్ గౌరవం
బున నీ విప్రులుఁ జూచిరందువలనఁ బూర్వస్థితిన్
జెంది భో
జనవస్తుప్రకరంబులన్నియు యథాస్వస్థంబు లౌగావుతాన్"
భావం: గొప్పవాడు, వేములవాడ వంశస్థుడు,
ద్రాక్షారామ భీమేశ్వరుని తనయుడీ భీమన అని తెలుసుకొని, నిందించడం
మాని, ఈ బ్రాహ్మణులందరూ నన్ను గౌరవంతో
చూసారు. అందువలన ఈ భోజనవస్తుసముదాయమంతా కూడా మునుపటి రూపు పొంది వాటి పూర్వస్థానానికి వచ్చును గాక!
శాపాన్ని పెట్టడమే
కాక, తన శాపాన్ని సమూలంగా పటాపంచలు చేయగల శక్తిని కూడా కలిగి ఉండడం వలన ఈయనను అందరూ శాపానుగ్రహ(శాప+అనుగ్రహ) సమర్థుడని కీర్తించేవారు.
కం శాపానుగ్రహ పటువును
రాపాడెడి
కవుల నెత్తి రంపంబనగా
భూపాల
సభలబూజ్యుడ
నా పేరు భీముడండ్రు నరవర
వినుమా!
భావం: మహారాజా! వినండి. శాపానుగ్రహ(నిగ్రహానుగ్రహ) శక్తి కలవాడను, కవిత్వంలో ఎదురొడ్డే కవుల నెత్తి మీద రంపమై, ఆ రాజుల పూజ లందుకునే వాడను. నా పేరు భీమన.
సీ గడియలోపలఁ
దాడిఁగడగి ముత్తునియగాఁ
దిట్టిన మేధావి భట్టు
కంటె
రెండు గడెల బ్రహ్మదండి
ముండ్లన్నియు
డుల్లఁదిట్టిన కవి
మల్లుకంటె
మూడు గడియలకు మొనసియత్తిన గండి
పగులఁ
దిట్టిన కవి భాను కంటెఁ
నఱజాము లోపలఁ జెఱువు నీళ్లింకంగఁ
దిట్టిన బడబాగ్ని భట్టు
కంటె
ఆ.వె నుగ్రకోపినేను
నోపదు శపియింపఁ
గ్రమ్మఱింప శక్తి గలదు నాకు
వట్టి మ్రానఁ జిగురు పుట్టింపఁ
గిట్టింప
బిరుద వేములాడ భీమకవిని
భావము: గడియలో మూడు ముక్కలుగా విరిగిపోవాలని తిట్టి తాటిచెట్టును నేలకూల్చిన మేధావి భట్టు కన్నా, రెండు గడియల కాలములో బ్రహ్మజెమ్ముడు ముండ్లనన్నిటినీ ఊడిపడేలా చేసిన కవి మల్లు కన్నా, మూడు గడియలలో ఉధృతి పెరిగి పైకెగసిన గండికొండను ప్రగులకొట్టిన భానుకవి కన్నా, తెల్లారేలోపు చెరువులోని నీళ్లన్నిటినీ ఇంకిపోయేలా శపించిన బడబాగ్ని భట్టు కన్నా ముక్కోపిని నేను. శపించగల, శాపమును ఉపసంహరించగల శక్తి కలదు నాకు. ఎండినమ్రానుకు చిగురు పుట్టించగల, గిట్టించగల వేములవాడ భీమకవిని
చ బిసరుహగర్భువ్రాతయును
విష్ణుని చక్రము వజ్రి వజ్రమునఁ
దెసలను రామబాణము యుధిష్ఠిరు కోపము
మౌని శాపముఁ
మసకపుంబాము కాటునుఁ
గుమారునిశక్తియుఁ గాలుదండముఁ
పశుపతి కంటిమంటలును బండిత వాక్యము
రిత్తవోవునే!
భావము: బ్రహ్మ వ్రాతను, విష్ణుని చక్రము, ఇంద్రుని వజ్రాయుధము, గురి తప్పని రామబాణము, ధర్మరాజు కోపము, ముని శాపము, నల్ల త్రాచు కాటును, కుమారస్వామి శక్తి అస్త్రము, శివుని కంటిమంట, పండితుబి వాక్యము వ్యర్థం కావు.
ఒకనాడు భీమకవి
ద్రాక్షారామములో సప్తగోదావరీనదీ తీరాన పందిళ్లను వేయించి, యాగశాలలను ఏర్పాటు చేసి మహాసప్తాహమనే
పేరుతో భీమేశ్వరుని ఆరాధిస్తూ మాహాయజ్ఞమును ఎన్నో రోజుల నుంచి నిర్విరామముగా జరిపించారు.
ఇది జరుగుతుండగా, ఒకనాటి రాత్రి భోజనము వడ్డించేటపుడు నెయ్యి అయిపోయింది. భీమకవి ఇంత
రాత్రివేళ ఎవరికి కబురు పంపినా లాభముండదని
గోదావరి మాతను నేయిగా మారి ప్రవహించమని చెబుతూ చెప్పిన పద్యము
శా భీమేశప్రముదంబు
సేయఁ గవియౌ భీమన్న సప్తాహము
ల్నీ మంబొప్పనొనర్చుచుండ నిచటన్
నేయెంత లేకుండె నీ
ధామంబందున నీరిమేల్ ఘృతముగాఁ దత్త్వంబు మాఱించినన్
ధీమంతుల్గొనియాడ నేయి వగుమా
ధీసప్త గోదావరీ
భావము: భీమేశ్వరున్ని సంతోషపెట్టడానికి భీమకవి చేస్తున్న సప్తాహమిది.
ఇక్కడ ఎంతో నియమనిష్ఠలతో, నిరాటంకంగా ఈ క్రతువు జరుపబడుతోంది. అయితే ఈ ప్రాంతమున నెయ్యి కొంచెము కూడా లేకున్నది. నీటినే నెయ్యిగా మార్చివేస్తే విద్వాంసులు, పండితులు, నిను
ఎంతగానో పొగుడుతారు. ఓ జ్ఞాన సప్తగోదావరీ నెయ్యిగా మారుమా!
భోజనానికి
వచ్చిన వారందరూ తృప్తిగా
భోజనం చేసి వారి వారి ఇండ్లకు వెళ్ళిన తర్వాత భీమకవి గోదావరి నదిని తిరిగి నీటిగా మారి
మునుపటిలా ప్రవహించమని చెబుతూ ఈ పద్యం చెప్పారు.
ఉ వచ్చిన వారలందఱును వారని తృప్తి భుజించి వైచినన్
జెచ్చెఱ సంస్తుతించిరికఁ జెందుము నీ తోలిరూపు
నీరమై
పెచ్చు పెఱింగి
జీవతతిఁ బ్రీతివహింపగ నింద్రజాలమం
త్రచ్చవి సప్త
గౌతమి! ముదంబల రారఁగ మన్నియుక్తవై
భావము: ఓ
సప్త గోదావరీ! సహపంక్తి భోజనానికి వచ్చిన అన్నార్థులు ఎంతో తృప్తిగా భోజనం చేసి, నీ
మహిమను గొప్పగా పొగుడుతూ వెళ్ళిపోయారు. అందరి
మనస్సులు అలరారగ నా ఇంద్రజాల మహిమను గైకొని, వెంటనే నీ మునుపటి రూపమైన నీరుగా మారి, మిక్కిలి ఉదృతముగా పెరిగి, విజృంభిస్తూ, భూషణధ్వనులను
చేస్తూ గొప్పగా జీవనదియై ప్రవహించుమా!
జీవకోటి ప్రీతితో ఆనందించును.
నేయ్యిగా
మారిన గోదావరినది జలమయమై యథాప్రకారంగా ఉరకలేస్తూ ప్రవహించింది.
నాటి నుండి అక్కడి వారంతా భీమకవి
ఒనరించిన మహాసప్తాహవైభవమును గురించి “భోజనము పెట్టించిన భీమకవియే పెట్టించవలెను.
శాపమును పెట్టుటను, పెట్టిన శాపమును తీసివేయుటను భీమకవికి తప్ప ఈ భూమిపై మరి
ఎవరికీ సాధ్యము కాని పని“ అని అక్కడకు వచ్చిన వారందరూ చెప్పుకునేవారు.
భీమకవి
ద్రాక్షారామమున ఉన్నప్పుడు చీదమార్యుణ్ణి
కలుస్తూ ఉండేవారు. ఒకనాడు వీరిద్దరూ గోదావరీస్నానమాచరించడానికి వెళ్ళారు. అది వేసవి కాలము. కోరుమిల్లి గ్రామము
సముద్రానికి దగ్గరగా ఉండడం వలన సముద్రపుపోటు తగిలి వేసవిలో గోదావరి నీరు ఉప్పగా
అవుతుంది. ఆ సందర్భములో చెప్పిన పద్యం.
చ సుమహితవార్థి
కౌఁగిటను జుట్టి నినున్ రహినింప నాతనిఁ
గమన ధృతిఁ బెనంగి మెయిఁ గట్టుక వచ్చితివీవు
గౌతమీ
రమణిరొ! వీడు సాగరుని
రమ్యతరంబుగఁ జీదమార్యుఁడా
చమనముఁ జేయఁ బోవు
నిఁక సాగవు మాయెదుటన్ వినోదముల్
భావము: ఓ గౌతమీ! మంచివాడు, గొప్పవాడైన సముద్రుడు నిను తన భాహువులతో చుట్టేసి తనలో కలుపుకోగా,
నీవు సంతోషంగా అతనిని చేరి తనువును వదులుటకు (సముద్రంలో కలవడానికి) వచ్చావు. అయితే
ఇప్పుడు చీదమార్యుడు ఎంతో గొప్పగా ఆచమనము చేయబోతున్నాడు. సముద్రున్ని వదలి ఉండుమా!
మా ఎదుట మీ ఆటలు ఇక సాగవు.
ఉ ఎప్పుడు
నిన్ను భీమకవి యిట్టులొనర్చెనొ నాఁటి నుండి నీ
యుప్పఁదనంబుమాని యిట నొప్పుగఁ
దియ్యఁదనంబునొందు మా
యొప్పులకుప్ప గౌతమి! మహోజ్జ్వల
భక్తుడు చీదమార్యుడున్
దప్పక నిన్ను నెల్లపుడుఁ
దద్దయుభక్తిని బూజసేసెడున్.
భావము: మా సుగుణసంపన్న రాశి! ఓ గౌతమీ(గోదావరీ)! ఎప్పుడు
నిను భీమకవి ఇలా చేసాడో ఆనాటి నుండి ఇక్కడ ఉప్పదనము మాని తీయదనమును పొందుము! మహా
భక్తుడైన చీదమార్యుడు ఎల్లప్పుడూ నిన్ను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.
భీమకవి సన్నిహితులలో ఒక
బ్రాహ్మణుడి భార్య, అతన్ని వదిలి ఉపపతి అను వ్యక్తి వద్దకు వెళ్ళిపోయింది. అతని
కాపురం సరిదిద్దడానికి ఉపపతిని హెచ్చరిస్తూ చెప్పిన పద్యము ఆ పద్యంలో ఆ బ్రాహ్మణుడిని
తుమ్మెదతోనూ, అతని భార్యను అప్పుడే వికసించిన తామర పువ్వుతోనూ పోలుస్తూ, ఈ రెంటినీ
వేరు చేస్తే తుమ్మెద ప్రాణము నిల్వదనీ, అందుకు కారణమైన వారికి బ్రాహ్మణహత్యాపాపి
అనడంలో తప్పులేదని, ఆ పాపం భరించకతప్పదని హెచ్చరించారు.
ఉ నవ్యవిలాస రమ్యనలినంబని బాలముఖాబ్జ సౌరభా
భివ్యసనంబునన్ బరగు భృంగ కులోత్తమ! తద్వియోగతా
వవ్యధఁ బ్రాణినిల్వదు కృపాగుణ మేర్పడ బ్రాహ్మణోనహం
తవ్య యనంగనొప్పు వచనస్థితిఁ గుందకెరుంగఁ జేయుమా!
ఒక రోజు సాయంత్రం ఉద్యానవనంలో భీమకవితో
మాట్లాడుతూ నడుస్తున్నపుడు చొక్కభూపాలుడు “మహానుభావా! మీరు ఏమన్నా అది జరుగుతుందని
ఆ ఊరా, ఆ ఊరా చెప్పుకుంటున్నారు. అది
వినడమే కానీ, మీ మహిమను ఎన్నడూ చూసి ఎరుగను. ఒక్కసారి మీ మాధుర్యకవితా మహిమను
కనులారా చూడాలని ఉంది. ఒక పద్యము చెప్పి ఈ మల్లెపందిరిన పాతపడి ఉన్న ఆ కొయ్య
స్తంభాన్ని చిగురింపచేయవా?” అని అడిగినపుడు చెప్పిన అద్భుత పద్యాలు.
శా. ఆనీతాభ్యుపదాన శృంఖల కరాభ్యాలంబిత స్తంభమా!
నేనే వేములవాడ భీమకవినేనిం
జిత్రకూటంబులో
భూ నవ్యాపృత పల్లవో
పలతికా పుష్పోపగుచ్ఛంబులన్
నానా పక్వ ఫల ప్రదాయి
వగుమా నా కల్పవృక్షాకృతిన్
భావము:
మహాదాతయై దానకంకణం ధరించిన ఈ మహారాజు చేయి ఊది
ఉన్న ఓ స్తంభమా! నేను వేములవాడ భీమకవిని. నా మనోభీష్టం ప్రకారం ఈ భూలోకంలో ఇది
వరకు ఎన్నడూ జరుగని విధంగా వేర్లతో భూమిలోకి వ్యాపిస్తూ, కొమ్మలతో చిగురిస్తూ,
పుష్పపుగుచ్ఛాలను, రకరకాల మాగిన పండ్లను అందిస్తూ కల్పవృక్షంలా ఆకృతిని పొందుమా!
ఈ
వృక్షమును మునుపటిలా మల్లెపందిరి కొయ్య స్తంభంగా మార్చివేయండి” అని అడిగాడు. అపుడు భీమకవి ఈ క్రింది పద్యమును చెప్పారు.
ఉ. “శంభు వర ప్రసాద కవిసంఘ వరేణ్యుడ నైన నా వచో
గుంభన
మాలకించి యనుకూలత నొంది తనూన భావనన్
కుంభినిఁ జొక్కనామ నృపకుంజరు పందిటి మల్లె సాలకున్
స్తంభము రీతి నీ తనువు దాలిచి ఎప్పటి
యట్ల ఉండుమా”
భావం:
ఈశ్వరవరప్రసాదిని, కవితాగ్రేసరుడనైన నా పలుకులను ఆలకించి, నా అభీష్టం ప్రకారం,
అత్యంత వినయముతో నీ తనువును దాల్చావు. భువిలో చొక్కన అనే మహాచక్రవర్తి పందిటిలోని
మల్లెశాలకున్న స్తంభముగా నీ మునుపటి రూపాన్ని పొంది ఎప్పటిలాగా ఉండుమా!
సాధుసత్పురుషులను
ఆదరిస్తూ, ధర్మాన్ని నాలుగు పాదాలపై నడిపిస్తూ, ఎంతో చక్కగా పరిపాలిస్తున్న
ధర్మపరిపాలకుడూ, గుణసంపన్నుడు అయిన చొక్కనకు,
సాహిణిమారునికి మధ్య జరుగుతున్న యుద్ధంలో చొక్కనకు విజయం చేకూరేలా అనుగ్రహిస్తూ
చెప్పిన పద్యము
ఉ చక్కఁదనంబు
దీవియగు సాహిణిమారుఁడు మారు కైవడిన్
బొక్కి పడం గలండు చలముం బలముం గల
యీచళుక్యపుం
జొక్కనృపాలుఁడు గ్రుఁడయి చూడ్కుల
మంటలు రాలఁ జూచినన్
మిక్కిలి రాజశేఖరుని మీఁదికి
వచ్చిన రిత్త వోవునే?
భావము:
ఎంతో చక్కగా పాలింపబడుతున్న రాజ్యము ఇది. అమిత శౌర్యపరాక్రమములు గల ఆ చాళుక్యరాజైన చొక్కనృపాలుడు
ఉగ్రుడై చూడగానే ఆ చూపులకు రాలే మంటలకు శివుని మూడోకంటి మంటకి మసి అయిన మన్మథునిలాగా,
సాహిణిమారుడు తన శరీరమును కోల్పోతాడు. గొప్ప చక్రవర్తి మీదకి వస్తే, దాని ఫలితం
వూరికే పోతుందా?
భీమకవి తెలుంగరాయుడి
ఆస్థానమునకు వెళ్ళినపుడు కస్తూరి, పచ్చకర్పూరము, జవ్వది సుగంధవస్తువులను బహుమతిగా
ఇచ్చి తన అనుగ్రహమును పొందమని చెబుతూ చెప్పిన పద్యము.
మ ఘనుడన్ వేములవాడ వంశజుడ ద్రాక్షారామభీమేశ
నం
దనుడన్; దివ్యవిషామృతప్రకట నానా
కావ్యధుర్యుండ; భీ
మన నా నామమెరుంగ జెప్పితిఁ దెలుంగాధీశ!
కస్తూరికా
ఘన సారాది సుగంధవస్తువులు వేగందెచ్చి లాలింపురా.
భావము: గొప్పవాణ్ణి, వేములవాడ వంశస్థుడను, ద్రాక్షారామభీమేశ్వరుని కుమారున్ని, విషము, అమృతం రెంటిని అమోఘమైన నా పలుకుల్లో
కురిపించగలవాడను, ఎన్నో ఉద్దండ కావ్యాలను వ్రాసినవాడిని. భీమన నా
పేరు. తెలుసుకుంటావని చెప్తున్నాను. కస్తూరి, పచ్చకర్పూరం మొదలగు
సుగంధద్రవ్యాలను త్వరగా ఇచ్చి బుజ్జగించుము!
తెలుంగరాయుడితో
పాటు వేటకు వెళ్ళినపుడు “వరాహమును మాటు నుండి కొట్టడం పౌరుషలక్షణము కాదు.
వరాహమునకు ఎదురేగి ప్రతిభను ప్రదర్శించి పట్టుకున్నవాడే ప్రజ్ఞావంతుడు.” అని అన్నపుడు.
తెలుంగరాయడు “మీకా సామర్థ్యముంటే చేసి చూపండని” అడిగాడు. భీమకవి “నేను
వాక్పరాక్రమమున్న కవిని. నాకు నోటిమాట చాలు ఆ వరాహమును పట్టి తీసుకురావడానికి”
అంటూ చెప్పిన పద్యము.
చ కడకు ధనంజయుండు మును ఖాండవమున్ దహించు వేళ
నే
ర్పడ శరజాల నిద్ధమయి వర్షములొఁ
జొఱ జాలనట్టులీ
యడవిన సందుగాన కిట నాగు వరాహమ!
నాదు వాక్కునఁ
బొడువదు ప్రొద్దుకూడ నిను భూపతి
కర్పణ సేతు నియ్యెడన్
భావము:
ఈ అడవిన పొదలంలో దాగబోయిన ఓ వరాహమా! పూర్వము ఖాండవవనము అగ్నికి ఆహుతి అవుతున్నవేళ
అర్జునుడు సంధించిన బాణాలచే ఆపబడి, వర్షించిన మేఘునిలా ఆగిపో! నా మాటకు పొడిచే
పొద్దు కూడా పొడువదు. ఈ వేళ నిను మహారాజుకు బహుమతి చేయబోతున్నాను.
మహా విష్ణువు అవతారమైన వరాహమును
బంధించిన కళంకం అంటకుండా, తాము బంధించిన వరాహము పరిస్థితిని చందమామతో పోలుస్తూ నృసింహపురాణములో
రచించిన పద్యము చక్కటి పద్యము.
చ సురచిరపానపాత్రమున సుందరియొక్క తే కేలనిండు చం
దురుడు ప్రకంపితాంగములతోఁ దిలకించెఁ దదానంబుజ
స్ఫురిత వికాసవైభవము సొంపులడంకువ
మ్రుచ్చిలింపఁ జె
చ్చెరఁ జనుదెంచి కట్టువడి చేడ్పడి భీతివడంకు
చాడ్పునన్
భావము:
ఆ సుందరి చేతిలో ఉన్న మిక్కిలి రమణీయమైన పానపాత్రము (లోటా లేదా పాత్ర)లో చంద్రుడు
అత్యంతగా ప్రకాశిస్తున్నాడు.
తన అందాలన్నీయూ ఆ సుందరి ముఖవైఖరులచే దొంగలింపబడినట్లుగా చంద్రుడు ఆమె చేతిలో ఉన్న
పాత్రలో కట్టుబడిపొయి భయముతో వణుకుతూ ఉన్నట్లుండెను.
భీమకవి
అష్టసిద్ధులు అంటే ఏమిటో తెలుంగరాయుడికి చెబుతూ చెప్పిన శ్లోకము
“అధిమా మహిమా చైవ గరిమాలఘిమా
తధా
ప్రాప్తిః
ప్రాకామ్య మీశత్వంపశత్వం చాష్టసిద్ధియః”
తెలుంగరాయుడితో
ఒక సందర్భంలో “ కవి గాంచు రవి చూడగా లేని యర్థంబు. అంటూ” మజ్జిగ చల్లుకుంటూ
వయ్యారంగా నడుస్తున్నన గొళ్ళభామ గురించి ఆమె మనసులోని పశ్చాత్తాప భావమును ఆమె
మాటల్లో భీమకవి చెప్పిన పద్యము
ఉ భూపతిఁజంపితిన్
మగడు భూరిభుజంగము చేతఁ జావగా
నాపద జెంది జెంది
యుదయార్కునిపట్ణముఁ జేరి వేశ్యనై
పాపముఁగట్టుకొంటి సుతుఁబట్టి
బొజుంగని జెట్టవట్టి సం
తాపముఁజెంది యగ్ని బడ
దగ్ధముగాకిటు గొల్లభామనై
యీవని కోర్చుకొంటి నృపతీ! వగపేటికిఁ జల్ల చిందినన్
భావము:
మహారాజును చంపాను. భర్త పాముకాటుకు మరణించడముతో ఆపదల పాలై ఉదయార్కునిపట్టణమును
చేరి వేశ్యనై పాపము కట్టుకున్నాను. కొడుకు నను మోహించగా ఆ బాధతో అగ్నిలో దూకాను.
అగ్నిదేవుడు కూడా నన్ను తాకడానికి ఇష్టపడక, దహించకపోవడంతో ఇక్కడకు వచ్చి గొల్లభామనై,
విలాసావతినై మజ్జిగ చిందించుకుంటూ బ్రతుకుతున్నాను!
రణతిక్కన
రణనిహతుడైనపుడు అతని గుణగణాలను, అతని శౌర్యపరాక్రమములను వర్ణిస్తూ చెప్పిన
అద్భుతపద్యాలు.
చ పదటునవాజిరాహుతుల
పై దుమికించుచుఁదిక్కఁడార్చినన్
బెదిరిపరిభ్రమించికడుఁ బిమ్మట
వీరులు భీత చిత్తులై
యదె! యదె!
వాలువాల్మెఱుఁగులల్లదె! యల్లదెయాతడంచనఁ
గొదుకకయాజిసే సెరిపుకోటుల
కందఱకన్ని రూపులై
భావము: శత్రుసైనిక సముదాయాల్ని
భయభ్రాంతులను చేసి “ అదిగో అదే తిక్కన కత్తి తళతళలు, అదే వెలుగు, అదిగో అతను ఇక్కడ
ఇక్కడ అని ప్రతి యోధుడూ అనుకొనేలా అందరికీ అన్ని రూపాలుగా కనిపించే వేగంతో
రణతిక్కన యుద్ధం చేశాడు. ప్రాణాలకు తెగించిన ఆ మహాశూరుని ముందు ఏవరూ నిలువలేక
పోయారు.
ఉ చిక్కక
మన్మసిద్ధివిభుచేమును గొన్న రుణంబుదీర్చె మా
తిక్కనమంత్రిసోమశిల
దేవరసాక్షిగఁ బెన్న సాక్షిగా
నెక్కినవాజిసాక్షిగ
మహిన్నుతికెక్కినకీర్తి సాక్షిగా
స్రుక్కక మారుకొన్న రణశూరులు
సాక్షిగఁ గొండ సాక్షిగన్
భావము:
సోమశిల దేవుని సాక్షిగా, ప్రవహించే పెన్నానది సాక్షిగా, ఎక్కిన గుర్రము సాక్షిగా,
ఈ భువిలో పేరుకెక్కిన కీర్తి సాక్షిగా, భయపడి వెనుదిరగక పోరాడిన యుద్ధవీరుల
సాక్షిగా, ఆ కొండ సాక్షిగా, మన రణతిక్కన మన్మసిద్ధిరాజు రుణమును తీర్చుకున్నాడు.
సీ రణరంగమున
మోహరంబులఁబొడగని
ప్రాణంబువాసిన
వందగజమ!
విజయాధిపునిదాడి వెనుకొని
తగులంగ
దెసదప్పి పాఱిన
దిగ్గజంబ!
చేరఁజాలక తిర్గి చేమడ మళ్లించి
మంచానకందనీ మదగజంబ!
పెనుతుల్లిచెఱ్వులోఁ
బిరుదులన్నియుఱొంపిఁ
గ్రుంగంగఁద్రొక్కిన
కుంజరంబ!
నేడు మొదలుగాఁగ
నెల్లూరుపురములోఁ
బొగడుతనము సేయు మగలతలలు
వూరిఁగఱచితిక్క! భూతమైసోకుము
యూరివారిసోఁకుఁ గారుసేసి.
భావము:
యుద్ధరంగములో శత్రువ్యూహాలకు అందక
ప్రాణాలొడ్డిన మహాయోధుడా. విజయాధిపతిని సైతం వెంబడించి వెళ్ళి దిక్కు తప్పి వచ్చిన
దిగ్గజమా (భూమిని ఎనిమిది దిక్కులలో మొసే ఏనుగులకు దిగ్గజము అని పేరు)
ఎక్కడా (ప్రాణాలకై) చేయిచాచి అర్థించక
పోరాడిన మదగజమా,
పెనుతుల్లి చెరువులో నీ బిరుదులన్నిటినీ వేసి అనగదొక్కిన మహాగజమా, నేటి నుంచి
నెల్లూరులో నిను పొగడేవారిని, ఈ ఊరి వారిని వదలబొకు తిక్కనా!! భూతమై ఈ వూరి వారిని పట్టు!!
సీ ధైర్యంబు
నీ మేనఁ దగిలి యుండుటఁ జేసి
చలియించి, మంధరాచలము
తిరిగె
గాంభీర్యమెల్ల నీకడన యుండుటఁ
జేసి
కాకుత్థ్సుచే వార్ధి కట్టువడియె
జయలక్ష్మి నీయురస్థ్సలిని
యుండుటఁ జేసి
హరి పోయి బలి దాన
మడుగుకొనియెఁ
ఆకారమెల్ల నీయంద యుండుటఁ జేసి
మరుడు చిచ్చునఁ బడి
మడిసి చనియెఁ
గీ దిక్క
దండనాధ! దేవేంద్రపురికి నీ
పరుగు టెఱిఁగి నగము తిరుగు
టుడుగు
నబ్ధి కట్టువిడుచు నచ్యుతుకొద
మాను
మరుఁడు మఱలఁ గలుగు మగలరాజ!
భావము:
తన ధైర్యసాహసాలను నీ దగ్గర ఉంచి మంధరాపర్వతుడు సాగరమధనానికి వెళ్ళాడు. ఉవ్వెత్తున
ఎగసే అలలతో ఎగసిపడే సముద్రుడు తన గాంభీర్యమంతటినీ నీ చేతుల్లో పెట్టి
కాకుత్థ్సుడికి కట్టుబడిపోయింది. తన జయలక్ష్మిని నీ వద్దకు చేర్చి విష్ణుమూర్తి
బలి చక్రవర్తి వద్దకు బలిదానముకై వెళ్ళాడు. తన రూపాన్ని నీకిచ్చివేసి ఆ మన్మధుడు
శివుని కంటి మంటకు కాలి చనిపోయాడు. ఓ తిక్కన మంత్రి! దేవేంద్రపురి వైవు నీ పరుగు
తెలిసి, ఇక ఈ భువిలో ధైర్యసాహసాలకు, గాంభీర్యానికి, విజయలక్ష్మికి, అందానికి సరైన
ఆశ్రయము లేదని తలచి మంధరాపర్వతుడు పరిభ్రమను ఆపివేసాడు. సముద్రుడు కట్టువిడిచి
ఉప్పెనలా ఎగసి పడ్డాడు. విష్ణువు (బలిదానమపుడు భీకరరూపం దాల్చిన విష్ణువు) చిన్నగా
తగ్గిపోయాడు. మన్మధుడు తన రూపాన్ని సంతరించుకొని జీవము పొందాడు. పైన చెప్పిన
వారందరికీ రణతిక్కన ఎంతో ప్రీతిపాత్రుడు అని భావము.
సీ నందినిఁ
బుత్తెంచె నిందు శేఖరుఁడునీ
వన్న!! యేతెము
తారాద్రికడకు
గరుడుని బుత్తెంచె నరహరి
రావయ్య
వగసిద్ధతిక్క!
కైవల్యమునకు
హంసను బుత్తెంచె నజుఁడు
నీకడకును
భయకులమిత్ర! రా
బ్రహ్మ సభకు
ఐరావతమునంపె
నమరేంద్రుఁడిప్పుడు
దివమునకేతెమ్ము
తిక్కయోధ!
గీ యనుచు
వేఱువేఱ యర్థితోఁ బిలువంగ
వారు వీరుఁగూడి వచ్చి వచ్చి
దివ్యయోగియైన తిక్కనామాత్యుడు
సూర్యమండలంబు సొచ్చిచనియే.
భావము
: రణతిక్కన వీరమరణం పొందిన తర్వాత పరమేశ్వరుడు తన వాహనమైన నందిని పంపి కైలాసమునకు
ఆహ్వానించాడు. శ్రీ మహావిష్ణువు గరుడుని పంపి వైకుంఠమునకు రమ్మని, కైవల్యమును
ప్రసాదిస్తానని ఆహ్వానించాడు. హంసను పంపి బ్రహ్మదేవుడు మిత్రమా! బ్రహ్మసభకు రమ్మని ఆహ్వానించాడు. ఇక ఇప్పుడు
ఇంద్రదేవుడు తన ఐరావతమును పంపి తిక్కనయోధున్ని స్వర్గానికి రమ్మని ఆహ్వానించాడు.
హరిహర బ్రహ్మాదిదేవతలే తమ లోకాలకు రమ్మని తమ తమ వాహనాలను పంపిస్తే దివ్యయోగి అయిన
ఆ తిక్కనామాత్యుడు అవేవీ ఆశించక సూర్యమండలాన్ని ఛేదించుకొని అపునరావృత్తలోకాలకు వెళ్ళిపోయాడు.
ఉ వెన్నెలలేని
రాత్రియు రవిప్రభ లేనిదివంబు నీరులే
కున్న సరోవరంబుఁగ నొప్పగు
దీపము లేని యిల్లు నై
విన్నదనంబునొందె
మనవిక్రమసింహపురంబు చూడఁగాఁ
బున్నమచంద్రుఁ బోలుమన
పోలమతిక్కడు లేమినక్కటా!
భావము:
పున్నమి చంద్రుడిని పోలిన పోలమతిక్కడు లేకపోవడం వల్ల మన విక్రమసింహపురము(నెల్లూరు
పట్టణము) వెన్నెలలేని రాత్రిలాగా, రవిప్రభ(సూర్యకాంతి) లేని దినంలాగా, నీరు లేని
సరోవరంలాగా, దీపం లేని ఇల్లు లాగా వెలవెల బోయింది.
క గుణముల
నిధానమగు మన
రణతిక్కన తాఁగళేబరంబును
శిరమున్
గణక మెయిఁ గలయఁ బ్రదుకునుఁ
బ్రణుతాఖిల వైరి మకుట భాసిత
పదుడై
భావము:
గుణములకు నిలయమైన (మంచి గుణాలు కలిగిన) మన రణతిక్కన (ఇంత త్వరగా మరణించకూడదు) తన
మొండెమును, శిరస్సును దగ్గర చేసి కలిపిన శరీరము(తల మోండెము) ఒక్కటై బ్రతుకుతాడు. ఈ
లోకములో అఖిలశత్రుగణాలచే గొప్పగా కీర్తింపబడుతూ వర్ధిల్లుతాడు.
ఉ ఏమి
తపంబుఁజేసి పరమేశ్వరునేమిటఁ బూజసేసిరో
రాముని తల్లియుఁ బరశురాముని తల్లియు
భీముతల్లియుఁ
గాముని కన్న తల్లియును గంజదళాక్షుననుంగుఁ
దల్లియున్
శ్రీ మహిత ప్రతాపుడగు సిద్ధయ తిక్కనఁగన్న
తల్లియున్
భావము:
ఎంత తపస్సు చేసి పరమేశ్వరుని ఏవిధంగ పూజించారో శ్రీరాముని తల్లి కౌసల్య,
పరశురాముని తల్లి రేణుక, భీముని కన్న తల్లి కుంతి, మన్మధుని లక్ష్మి, శ్రీకృష్ణుని
తల్లి దేవకి, శివుని శూలమంటి ప్రతాపమును(ధైర్యసాహసములు) సిద్ధించుకున్న (సిద్ధయ) తిక్కనను కన్న తల్లి పోలమాంబ, ఎంత
పుణ్యాత్ములో అంతటి గొప్పవారిని కన్నారు.
ఉ శ్రీలలరారశత్రువులఁ
జెండితివార్యులు మంత్రివర్యులా
ర్వేలఘనుల్ నుతించిరలవేర్పు దొరల్ ముదమంది
మెచ్చిరో
లాలిత శౌర్యధైర్య జయలక్ష్మి ప్రియంబున
నిన్వరించెనీ
లీలలుహెచ్చెఁ దిక్కని కళేబరమా యిక
నిల్చియాడుమా
భావము:
పూజ్యుడవు, మంత్రివర్యుడవై రాజ్యము సిరిసంపదలతో
అలరారేలా (శత్రువుల పాలుకాకుండా) శత్రువులను చెండాడావు.
అర్వేలఘనులెందలెందరో నిను ఏమని స్తుతించారో, నీ కార్యసిద్ధికి రాజులు సంతోషించి
ఎంతగా కొనియాడారో, శౌర్యధైర్య జయలక్ష్మిని (పరాక్రమము, ధైర్యము, విజయములకు అధిపతి
అయిన అష్టలక్ష్మిని) సైతం ప్రసన్నము చేసుకున్నావు. నీవు సాధించాలిన కార్యాలు ఇంకా
చాలా ఉన్నాయి. ఓ తిక్కన కళేబరమా! ఇక లేచి కదలిరా!
భీమకవి మైలమ భీముని శౌర్యపరాక్రమములను గురించి
ఎన్నో అద్భుతపద్యాలతో వివరించారు. వాటిలో కొన్ని మాత్రమే దొరికాయి.
చ గరళపుముద్ద
లోహమవగాఢ మహాశని కోట్లు సమ్మెటల్
హరు నయనాగ్ని కొల్మి యురగాధిపు కోఱలు పట్టుకార్లు ది
క్కరటి శిరంబు దాయి లయకాలుఁడు కమ్మరి వైరివీర సం
హరణ గుణాభిరాముడగు మైలమభీముని
ఖడ్గసృష్టికిన్
భావము: లయకారకుడైన శివుడే స్వయాన కమ్మరియై, తన కంఠాన
దాచుకున్న కాలకూటవిషమునే (గరళపుముద్ద) ఇనుపలోహముగా మార్చి, దద్దిల్లుతూ
కోట్లకొలదిగా రాలే పిడుగులను సమ్మెటలుగా(దభీదభీమని మోదే సుత్తులు) వాడి, తన
కనుమంటలనే కొలిమిగా చేసి, తన మెడలో ధరించిన సర్పరాజు వాసుకి యొక్క కోరలనే
పట్టుకార్లుగా చేసి, ఎనిమిది దిక్కులా భూమిని మోస్తూ ఉన్న అష్టదిగ్గజాలలో (ఎనిమిది
ఏనుగులు) ఒక ఏనుగును తలదాయిగామార్చి, శత్రువులను సంహరించడంలో, మంచి గుణాలలో
రాముడంతటివాడైన మైలమ భీముని ఖడ్గమును సృష్టించాడు.
ఈ
మైలమభీముని కీర్తి గురించి పొగుడుతూ భీమకవి చెప్పిన ఇంకో మహాద్భుతమైన పద్యం. ఈ
పద్యములో మనిషి లేకున్నా చివరకు మిగిలేదేంటో చక్కగా చెప్పారు.
ఉ నేరుపు
బ్రహ్మఁ జేరె నిజనిర్మల తేజము సూర్యుఁ జేరెఁ నా
కారము కాముఁ జేరెఁ నధికంబగు లక్ష్మియనంతుఁ
జేరె గం
భీరత వార్థిఁ జేరెఁ గల పెంపు కులాద్రుల
జేరెఁ గీర్తి దా
నూరట లేక త్రిమ్మరుచు నున్నది మైలమ
భీముఁడీల్గినన్
భావము:
మైలమభీముని మరణము తర్వాత అతని నైపుణ్యం బ్రహ్మను చేరింది. అతని తేజస్సు సూర్యుణ్ణి
చేరింది. రూపము మన్మధుణ్ణి చేరింది. అతని సంపద (లక్ష్మి) విష్ణువును చేరింది.
గాంభీర్యము సముద్రాన్ని చేరింది. ఔన్నత్యము కులపర్వతాలను చేరింది. కానీ మరణము వలన
అతని కీర్తి మాత్రం ఎక్కడ చేరాలో తోచక ఈ లోకంలోనే తిరుగుతున్నది. అనగా నేర్పు మొదలగు
గుణాలలో అతనికి సరిసమానులుగా చెప్పదగిన బ్రహ్మాదులున్నారు. కానీ అతని మరణం తర్వాత
కీర్తికి ఆశ్రయం లభించలేదంటే అతనితో సమానకీర్తి గల మరొక ఆశ్రయమేదీ ప్రపంచములో ఎక్కడా
లేదని, అతడు అసమాన కీర్తిశాలి అని భావము.
మైలమభీముడు
చనిపోయినపుడు భీమకవి రచించిన పద్యాలలో ఈ క్రింది “విలాపగీతం” (elegy) తెలుగు సాహిత్యంలో అట్టి గీతాలలో
మొట్టమొదటిదే కాదు; సాటి లేనిది కూడా. ఆ గీతంలోని రసగుళిక ఈ క్రింద ఇవ్వబడింది.
ఉ యాచక ఖేచరుండు సుగుణాంబుధి మైలమభీమఁ
డీల్గినన్
జూచి
వరించె రంభ; యెడఁజొచ్చెఁదిలోత్తమ; దారినిద్దఱన్
ద్రోచె
ఘృతాచి ముగ్గుఱకు దొద్దడి కయ్యముపుట్టెనంతలో
నాఁచుకుపోయె
ముక్తిసతి నవ్విరి యద్దశఁ జూచినిర్జరుల్
నోచినవారిసొమ్ములవి
నోమనివారికి వచ్చునేధరన్
బీరపుఁబొత్తముఁగట్టుకొనిపోయె
పువ్వులు వేడుకైనఁ
గడివోయిన
వాళ్ముడువంగవచ్చునే ఎంతదఱిగిన మి
రియాలుంజొన్నలసరిపోవే
కొఱ్ఱెవ్వఁడింటికంబమునేసెఁ
నోచినవారిసొమ్ములవి
నోమనివారికి వచ్చునేధరన్
పిడుగు
చిట్లినభంగిఁ జీలుగు వెఱిగినమాలెకుఁగంబంబు
గాదు
చెఱువువిడిచి కాలువ బొగడంజనునే ఎదిరికి
న్మడచు
వాడు, తనకుదగరంబు సఱచు టెంతటి భరంబు
భావము: పేదవారికి ఇలవేలుపు, మంచి గుణాలలో
సముద్రము వంటి విశాలమైనవాడు. అయిన మైలమ భీముడు మరణించిన తర్వాత పరలోకాన మైలమ
భీముడిని చూచి రంభ ఆశపడింది. అతని మనసులో స్థానము కోసము వచ్చింది తిలోత్తమ. దారిలో
ఇద్దరినీ త్రోసి నాకు అంటూ వచ్చింది ఘృతాచి. ముగ్గురికి మధ్య పెద్ద గొడవ
మొదలయింది. అంతలో ముక్తిసతి వచ్చి వారి గొడవను ఆపివేసెను. ఆ సంఘటనను చూసిన
దేవతలందరూ నవ్వుకొనారు. ఎన్నో నోములు నోయగా వచ్చే సంపద మైలమ భీముడు. నోములు నోయని
వారికి ఎలా వరించును?
చ అహితులఁ దాఁకి పోరు నెడ
నంబుధికల్గిననాటిరాము గో
గ్రహణమునాటి
పార్థు గదఁగాఁ గౌరవునేసిననాటి భీమునా
గ్రహ
మెసగంబురత్రయముఁగాల్చిననాటిలలాటలోచనున్
మహి
నుపమింపఁగాఁ దగునె మైలమభీముని భీమవిక్రమున్
భావము: శత్రువులతో యుద్ధములో సముద్రున్ని
దాటి లంక చేరిన రఘురాముడు, గోగ్రహనము నాటి అర్జునుడు, గదా విజృంభణ చేసిన నాటి
భీముడు, కోపగించినపుడు మూడోకంటి మంటతో (మన్మధున్ని)కాల్చిన నాటి పరమేశ్వరుడు ఇలా
మైలమభీముడి పరాక్రమమును ఎవరితో
పోల్చిచూసినా తక్కువే.
ఉ పన్ని తురంగమంబునకుఁ బక్కెర వెట్టినవార్త
చారుచే
విన్న
భయంబునంగలఁగి వేసటనాటనె చక్రగోట్టముల్
మన్నియపట్టణంబులును
మక్కెన వేంగి కళింగ లాదిగా
నిన్నియు
నొక్కపెట్టెగసె నేఱువభీమనృపాలుధాటికిన్
భావము: ఏరువభీముడు అమ్ములో ఖడ్గమును ధరించి
గుర్రమెక్కెనన్న వార్తను గూడాచారులచే విన్న వెంటనే భయమును కలిగి శత్రురాజుల
ఆయుధములు సైతము గురి తప్పుతాయి. కోటలు, ప్రభువులు, రాజ్యములు, చక్రగోట్టము, వేంగి
కళింగాది సామ్రాజ్యాలన్నీ ఏరువ భీముని పరాక్రమము ఎదుట నిలబడలేవు.
క అరినరు లేఱువభీమని
పొరువున
మనలేరు చిచ్చుపొంతను వెన్నై
తెరువునఁ
బైసరై జూదరి
సిరియై
రేన్చెట్టుక్రింద జిల్లెడుచెట్టై
భావము : ఏరువ భీముని పొరుగు రాజ్యాలలో
శత్రురాజులేవ్వరూ బ్రతికి బట్టకట్టలేరు. నిప్పు పక్కనున్న వెన్నలాగా, జూదరి
సంపదలాగా, రేని చెట్టు క్రింద జిల్లేడు చెట్టులాగా ఉనికిని కోల్పోతారు.
ఉ ఆలములో నరాతులకు హమ్మని మార్కోనవచ్చు నే
మహా
కాళికి
శూలికిన్ బ్రళయకాలపుగాలికి రాఘవేంద్రుబా
ణాళికిఁ
బక్షి నాయకునఖాళికి మత్తగజేంద్రవైరిదం
ష్ట్రాళికి
దావపావకశిఖాళికి మైలమభీమువాలికిన్
భావము: మహాకాళి అయిన పార్వతికి, శూలాన్ని
కలిగిన పరమేశ్వరునికి, ప్రళయకాలమున వీచే ప్రచండ వాయుదేవునికి, శ్రీరాముని బాణాల
ధాటికి, గరుస్మంతుని దాడికి, పదునైన దంతాల మదపుటేనుగు దాడికి, కుమారస్వామి శక్తికి
ఏవిధంగా అయితే ఎదురు నిల్వలేరో అలాగే యుద్ధములో మైలమభీముని శూరత్వము ముందు
శత్రువులు కూడా ఎదురొడ్డి పోరాడలేరు.
మ తెరలంబాఱి నభంబు దాఁకినఁ బయోధిం జొచినన్
శైలగ
హర్వముల్
దూఱినఁ జిక్కభీముడునృపవ్రాతంబుఁ బోనిచ్చునే
గరుడండై చని పట్టు మింటితుద నుగ్రగ్రాహమై చొచ్చి సా
గరమధ్యుంబునమ్రింగుఁ బట్టుకొను సింగంబైగుహాంతరంబునన్
భావము: శత్రురాజులు
పారిపోయి మేఘాలలో దాగినా, సముద్రంలోకి వెళ్ళి దాగినా, పర్వతాలు, గుహలలో దూరినా,
మైలమభీముడు వదలకుండా గరుస్మంతుడై ఆకాశమంచులదాకా వెళ్ళిపడతాడు. భయంకర మొసలి వలె
వెళ్ళి సముద్రమధ్యంలో ఎక్కడ ఉన్నా పట్టి మ్రింగుతాడు. గుహాంతరాలలో ఎక్కడ దాగినా
సింహమై వెళ్ళి పట్టుకుంటాడు.
క ఆలమునఁ
జిక్కభీముడు
వా లతివేగమునఁ బెఱికి నడితుదగవియఁ
బ్రేలిపడఁ బడుగు నేసెను?
ఏలేరును గసిమి భైరవేశుం డెఱుఁగన్
భావము:
యుద్ధములో చిక్కభీముడి ఖడ్గధార ప్రచండవేగానికి శత్రుసైన్యము అంతా నుగ్గునుగ్గయి
అంతమొందుతుంది. ఆ ఖడ్గధార విస్ఫోటనంతో వారిని అశక్తుల్నిచేసి కృశింపచేస్తాడు.
ఏలేరునేలె మైలమ భీముని పరాక్రమము భైరవునికి బాగా తెలుసు.
ఉ వీరగుణప్రతాపగుణవిశ్రుత!
మైలమ భీమ నీయశం
బారభమానితారకరహారవిలాసము నీనికేతనం
బారభమానతారకరహారవిలాసము నీభుజార్గళం
బారభమానతారకరహారవిలాసము చిత్ర మిద్ధరన్
ఉ భండనభీమ
నీయెదుర బాఱక నిల్చినశాత్రవుల్ బృహ
న్మండలపుండరీకపుర
నివాసులు నోర్చినన్ బృహ
న్మండలపుండరీకపురనాకనివాసులు
చచ్చినన్ బృహ
న్మండలపుండరీకపురనాకనివాసులు
చిత్ర మిద్ధరన్
భావము: మైలమభీమా! ఈ లోకంలో ఆశ్చర్యకర
విషయమేమంటే నీ ఎదుట పారిపోక నిల్చిన శత్రురాజులు, నీ చేత ఓడింపబడిన రాజులు, నీ చేత
యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన రాజులూ అందరూ నేరుగా ఈ మహావిశ్వంలో విష్ణుమూర్తి
నివాసమైన వైకుంఠపుర నివాసమును పొందుతున్నారు.
చ విదితగురుప్రతాపగుణవిశ్రుత మైలమభీమభూప నీ
పదిలపుఖడ్గదారఁ
దెగి పాఱినవీరుడు గోపురంబుపై
విదితసువర్ణరత్నమయవేదిక
మీదను నిల్చి కాంచు నౌ
పదిపదు
లగ్నిహోత్రులను బన్నిరుసూర్యుల నూఱుచంద్రులన్
భావము: శౌర్యగుణాలను కలిగినవాడిగా పేరు
మోసిన మైలమభీమరాజా, నీ పదిలమైన నీ ఖడ్గదారకు తెగి మరణించిన వీరుడు గోపురముపై
బంగారుమణి మయమైన వేదిక (తలశం) మీద నిల్చి వంద అగ్నిహోత్రులను (ప్రాతస్సాయంకాలములయందుఁ
జేసెడి హోమము), పన్నెండు సూర్యులను, నూరు చంద్రులను చూసే భాగ్యమును పొందుతున్నారు.
చ ఆసమునఁ గాసికానగరమం దసువుల్
త్యజియించినంతనే
యసదృశ
మైనకన్నుగల దచ్చట మైలమభీమభూప నీ
యసిఁ
దెగిపడ్డవైరులకు నంబకముల్ పదినూఱులయ్యె నీ
యసికిని
వారణాసికిని నంతర మెంత దలంచి చూచినన్
భావము: కాశీ నగరములో
ప్రాణాలు విడిచినంతనే సాటిలేని(మనో) నేత్రము కలుగును. మైలమ భీమా నీ ఖడ్గానికి
తెగిపడ్డ శత్రురాజులకు వెయ్యి(మనో) నేత్రమ్ములు కలుగుము. ఎంత చూసినా నీ ఖడ్గానికి,
వారణాసికి చాలా అంతరము కలదు.
ఉ ఏఱువ
భీమ! నీ పగతు ఱెక్కని కొండలు చంచలాత్ములై
దూఱనియట్టి ఘోరవనదుర్గములున్
వనితావియోగులై
పాఱనిత్రోవలుం దిననిపండ్లును
నాఁకటఁగూర లుప్పగా
నేఱనికఱ్ఱలుం గలవె యీలవణాంబుధి
వేష్టితావనిన్?
భీమకవికి
వైద్యశాస్త్రములో కూడా హస్తముంది. ఒకసారి వైద్యము చేయునపుడు, ఔషధము తయారు
చేయడానికి పేరాముదపాకులు కావలసి వచ్చింది. అవసరానికి అందుబాటులో ఉన్న ఒకతన్ని పారాముదపాకులు
కోసుకొని రమ్మని పంపాడు. అతడికి ఒక బ్రాహ్మణుడి ఇంటిలో తప్ప ఎక్కడా పారాముదపు చెట్టు కనపడకపోవడంతో ఆ ఇంటి ఆకులు
కోసుకోవడానికి ఆ ఇంటి యజమానిని అడిగాడు. అతడు అనుమతి ఇవ్వకపోవడంతో ఔషధానికి ఇంకో
దారిలేక దొంగతనంగా పారాముదపాకులు కోసే ప్రయత్నము చేసాడు. అది చూసిన బాపడు కర్రతో
కొట్టి తరిమాడు. అది గమనించిన భీమకవి ఆ బ్రాహ్మణుడిని అడగారిపోయేలా (సత్తువ
కోల్పోయి మూర్చిల్లేలా) శపించి, ఔషధానికి కావాల్సిన పారాముదపాకులు కోసుకెళ్ళారు.
క కూరడుగము
కాయడుగము
నారయఁగా నుల్లి బచ్చ లల్ల మడుగ
మా
పేరాముదపాకడిగినఁ
బారమ్మున నేసె నట్టె బాపఁడు
ద్రెళ్ళున్
రాజకళింగగంగును
కలవడానికి వచ్చిన భీమకవి తన మాదుర్యకవితా గొప్పదనమును గురించి చెప్పిన పద్యములు
ఉ “వేములవాడయందు
ఘన విశ్రుత కీర్తిఁ జెలంగ నందఱున్
భీమకవీంద్రుఁడంచు నను బెద్దగ నన్నుతిఁ జేయ
సజ్జన
స్తోమము లెల్ల సంతసిల్ల దుర్జనులెల్లను భీతి
నొందఁగా
బ్రేమను దక్షవాటిపుర భీమకృపాపరిలబ్ధ
తేజుఁడన్
భావము:
వేములవాడలో మిక్కిలి
ప్రసిద్ధి చెందినవాన్ని. అందరూ నను భీమకవీంద్రుడని గొప్పగా పొగుడుతారు.
నన్ను చూసి మంచివారు ఎంతగానో సంతోషిస్తారు, చెడ్డవారు భయపడుతారు. ద్రాక్షారామభీమేశ్వరుని ప్రేమను, కృపను పొంది వెలుగొందుతున్న వాడను.
క చెప్పెదనింపుగాఁ
గవిత శ్రేష్ఠవచః పరిగమ్య మానమై
యొప్పఁగ మంచి చెడ్డగను నోగును బాగగునట్లుగా
మఱిన్
గొప్పనుఁ గొద్దిగాఁ దవిలి కొద్ది పదార్థము
గొప్ప సేయ నా
కెప్పుడు శక్తిఁగల్గు జగదీశ్వర
నానుడులాలకింపుమా
భావము: శ్రేష్ఠమైన పలుకులతో అద్భుతమైన కవిత్వం
చెబుతాను. చెవులకింపుగా బాధలన్నీ మరపించేలా, ధారాళంగా, మంచి జరిగేలా, చెడు జరిగేలా, కలతలన్నీ దూరం అయ్యేలా, ఇంకా గొప్పదానిని
కొద్దిగానూ, కొద్దిదానిని గొప్పగానూ
చేసేలా కవిత్వం చెప్పగల శక్తి కలదు నాకు. మహారాజా నా కవిత్వమును వినుమా!.
“సరస్వతీ
కటాక్షమున్న కవుల పట్ల కళింగగంగు నిర్లక్షభావానికి, అతని గర్వానికి కారణమైన అతని
సిరిసంపదలు కోల్పోయేలా, శాపం పెడుతూ చెప్పిన చారిత్రాత్మక పద్యము.
ఉ వేములవాడ భీమకవి
వేగమె చూచి కళింగగంగు తా
సామము మాని కోపమున
సందడిఁదీఱిన రమ్ము పొమ్మనెన్
మోమునుఁజూడ దోషమిక
ముప్పది రెండు దినంబులావలన్
జామునకర్ధమందతని
సంపద శత్రులపాలు గావుతన్
భావము: వేములవాడ
భీమకవి వేగిరపాటు (తపన)
చూసి కూడా కళింగగంగు కనీసం
ఉభయకుశల ప్రశ్నలైనా వేయకుండా, కోపముతో ఇప్పుడు వెళ్ళి సందడి తీరిన తర్వాత రమ్మన్నాడు.
మోము చూడని తప్పుకు ముప్పది రెండు దినాల తర్వాతి వేకువజాములోపు అతని సంపద (రాజ్యం)
శత్రువుల పాలు కాక తప్పదు.
కళింగగంగు కష్టాలకు చలించి అతనిని తిరిగి అతని రాజ్యం
పొందేలా ఆశీర్వదిస్తూ చెప్పిన పద్యము
ఉ వేయి గజంబులుండఁ బదివేల
తురంగములుండఁ నాజిలో
రాయలగెల్చి సెజ్జనగరంబునఁ
బట్టముఁ గట్టుకో వడిన్
రాయకళింగ గంగు! కవిరాజ భయంకరమూర్తిఁ
జూడగా
బోయిన మీనమాసమునఁ
బున్నమవోయిన షష్ఠి నాఁటికిన్
భావము: రాజ కళింగగంగు! మహారాజులకు సైతం వణుకు
పుట్టించగల కవినైన నేను, భవిష్యత్తును చూస్తూ పోతే వెయ్యి ఏనుగులు, పదివేల
గుర్రములు నీ చెంత ఉన్నాయి. త్వరగా యుద్ధంలో రాయలను గెలిచి, మీనమాసములో పున్నము
తర్వాత వచ్చే షష్ఠి రోజుకంతా సెజ్జనగరమున పట్టము కట్టుకో.
భీమకవి కళింగ పట్టణవైభవమును గూర్చిచెప్పిన పద్యము.
సీ యోజనద్వయ విశాలోన్నతిఁ జెలువొంది,
పట్టణం బమరు శోభావిభూతి
హాటకరత్నకవాటాను మోదమై
సూటి మించును గంచుకోట మహిమ
నూటొక్కగుళ్ల చెన్నుగ శివానందమై,
నిత్యోత్సవ క్రీడ నెమ్మిఁదనరు
వంశధారానదీ వారాశి సంయుత,
సాగరసంగవిస్రంభ మమర
గీ గడిఁది రాజకళింగ భూకాంతునకును,
దసరున నవలక్ష కాళింగ మనఁగ
నొప్పి
శృంఖళద్వీప మనఁగఁబ్రసిద్ధి మించు,
గణన కెక్కుఁగళింగపట్టణము ధాత్రి
భావము :
పొగరుబోతు
కోమటిని తిడుతూ చెప్పిన పద్యములు
చ గొనకొనిమర్త్యలోకమునఁ
గోమటిపుట్టగఁ దోడఁ బుట్టె బొం
కునుఁగపటంబు లాలనయుఁగుత్సితబుద్ధియు రిక్తి
భక్తియుఁ
జనిమిరిమాటలున్ పరధనంబును గ్రక్కుననొక్కఁ
జూచుటల్
కొనుటలు నమ్ముటల్ మిగులఁ గొంటుదనంబును
మూర్ఖవాదముల్
ఉ కోమటి
కొక్కటిచ్చి పదిఁ గొన్నను దోషములేద; యింటికిన్
సేమమెఱింగి చిచ్చిడినఁ జెందదు పాపము;
వానినెప్పుడే
నేమరుపాటునన్ మఱియు నేమి యొనర్చిన లేదు
దోసమా
భీముని లింగమాన; కవిభీముని పల్కులు
నమ్మియుండుఁడీ
భావము:
అబద్ధములాడడం(బొంకు), మోసముచేయడం(కపటము), అత్యాశ(లాలస), నీచపుటాలోచనలు(కుత్సితబుద్ధి),
గౌరవాభిమానాలు లేకపొవడము(రక్తిభక్తి), కల్లబొల్లి మాటలు చెప్పడం (చనిమిరి మాటలు), పరులధనమును
నొక్కే అవకాశము కోసము చూచుట (పరధనంబును గ్రక్కునన నొక్కజూచుట), కొని అమ్మడములో
మొహమాటమును వదిలి మూర్ఖంగా వాదించడం వంటి లక్షణాలతో పుట్టిన ఏ కోమటి దగ్గరైనా పది
కొని ఒకదానికి మాత్రమే చెల్లించినా తప్పులేదు. వారికెటువంటి హాని కలుగకుండా, వారి
ఇంటికి చిచ్చుపెట్టినా ఏ పాపమూ కలుగదు. అతని ఏమరపాటును అవకాశముగా తీసుకొని మోసము
చేసినా తప్పుపాదని భీమేశ్వరునిని మీద ప్రమాణముచేసి ప్రకటిస్తున్నాను. ఈ భీమకవి
మాటలను విశ్వసించండి.
అక్కడే ఉన్న మరొక కవి, భీమకవి మాటలు
వినగానే, మిక్కిలి సంతోషముతో, ఇన్నాళ్ళూ ఆ కోమటిపై ఎంతో కోపమున్నా, అణుచుకొన్న
అతడు, ధైర్యము తెచ్చుకుని, కోమటిని తిడుతూ
ఈ పద్యమును చెప్పాడు.
వేములవాడభీమ! తగవేని! కవి శేఖరసార్వభౌమ!
నీ
వేమని యానతిచ్చితివి యిమ్ములఁ గోమటి
పక్షపాతివై
కోమటి కొక్కటిచ్చి పదిఁగొన్నను
దోసములేదటందురా?
కోమటి కొక్కటీక పదిగొన్నను ధర్మము
ధర్మపద్దతిన్
భావము: వేములవాడ భీమా! భళారే! కవిసార్వభౌమ! మీరేమని
మాటిచ్చారు ఇంకా ఒక ఇంచుక ఈ కోమటివైపు పక్షపాతము చూపిస్తూ, ఈ కోమటికి ఒక్కదానికి
చెల్లించి పది కొన్నా దోసము లేదంరా? ఈ కోమటికి పదికొని ఒక్కదానికి కూడా
చెల్లించకపోయినా ధర్మమే. అది ధర్మపద్ధతే అవుతుంది. ఏమాత్రమూ దోసము లేదు.
జన్నమాంబకు
వ్రణవిముక్తి చెయదలచి చెప్ప్న పద్యములు
క ఘనరోగంబుల
బలమా
కనుగొనగా జన్నమాంబ కర్మపుఫలమా!
నినుఁ బ్రార్థించెద వినుమా
మునుకొని యోగండమాల మునగకుఁజనుమా
భావము:
జన్నమాంబ కర్మల ఫలితంగా ఆమెను పట్టి పీడిస్తున్న అన్ని రోగముల కంటే బలమైన ఓ గండమాల(గొంతును
పట్టి పీడించు క్యాన్సర్)! నిన్ను ప్రార్థిస్తునాను, తక్షణమే ఈమెను వదిలి ఆ మునగ
చెట్టును ఆవహించుము!
చేసిన
సహాయమును మరచినదైన జన్నమాంబకు బుద్ధి చెబుతూ తిరిగి వ్రణమును ఆమె కంఠమును
ఆవహించమని చెబుతూ చెప్పిన పద్యములు
ఆవె మున్ను
జన్నమాంబ మునుకొని యుంటివి
యేను
బొమ్మటన్న యీవుజన్న
ముండ
యేరుగడచి ముదిపెండ్లికతసేసె
మునగగండమాల
ముండఁబట్టు
భావము:
ఓ గండమాలా! మొదట జన్నమాంబను పట్టి పీడిస్తుంటివి. నేను పొమ్మన్న తర్వాత నువ్వు
మునగచెట్టుకు అంటుకున్నావు. కష్టాలు తొలగిన తర్వాత ఈ విధవ ” ఏరు దాటించేదాకా
నిన్నే పెళ్లి చేసుకుంటానని, తీరా గండం గడిచిన తరువాత – ముసలాడివి నిన్నెవరు
చేసుకుంటారు?” అన్న శాస్త్రం ప్రకారం చేసిన ఉపకారము మరచిపోయి ప్రవర్తిస్తోంది.
కావున ఈ విధవను మళ్ళీ ఆవహించు.
ఆవె ఏను
భీమకవిని యిదె నిన్ను ప్ర్రార్థింతు
మునుపు
నీవువచ్చి ముండఁబట్టి
మునగకొండయయ్యె
మునుపటిరీతిని
మునగ
గండమాల ముండఁబట్టు
భావము:
ఓ మునగ గండమాలా! నేను భీమకవిని ఇదే నిన్ను కోరుకుంటున్నాను. నువ్వు శీఘ్రంగా వచ్చి
మునుపటిలాగా లాగా విధవను చేరుము.
గుడిమెట్ట ప్రాంతములో భీమకవి
దేశయాటనము చేయు గుఱ్ఱాన్ని పోతురాజు అపహరించగా
ఆ విషయాన్ని రాజుతీమారుడను అతని నుంచి ఈ విషయం చెపుసుకొని, పోతురాజు లచ్చనతో తన
గుర్రమును ఇప్పించమని పోతురాజుని హెచ్చరిస్తూ కబురు పంపినా కూడా, లెక్కచేయకపోగా తన
పట్లనే ఇలా ప్రవర్తిస్తే ఇక ప్రజల సుఖక్షేమాలను ఏవిధంగా చూసుకుంటాడని ఇటువంటి వాడు
పాలకుడిగా అనర్హుడని భావించి అతని తప్పును సరిదిద్దుకోవడానికి 7 రోజుల గడువు
విధిస్తూ రామాయణ వృత్తాంతముతో పోల్చి చెప్పిన పద్యము.
హయమది సీత; పోతవసుధాధిపు డారయ రావణుండు;
ని
శ్చయముగ నేను రాఘవుడ; సహ్యజవారధి; మారుఁడంజనీ
ప్రియతనయుండు; లచ్చన విభీషణుఁ డీ గుడిమెట్ట లంక; నా
జయమును బోతరక్కసుని చావును నేడవనాడు
చూడుడీ.
భావము: గుఱ్ఱము సీత వంటిది. అపహరించిన పోతురాజు రావణుడు. నేను ఖచ్చితముగా రాముడిని. ఈ కృష్ణానది సముద్రము. గుఱ్ఱము ఆచూకీ తెలిపిన రాహుతీమారడు
అంజనీ ప్రియతనయుడైన హనుమంతుడు. తనకు రాయబారము నడిపిన పోతురాజు తమ్ముడు
లక్ష్మీగజపతిరాజు విభీషణుడు. ఈ గుడిమెట్ట లంక. నా గెలుపును, పోతురక్కసుని చావును
ఏడవ రోజున చూడండీ.
గోపరాజు రామప్రధానుడనే నియోగిబ్రాహ్మణుడు
భీమకవి కాలానికి చెందినవాడు. ఇతడు తన స్వశాఖీయులైన బ్రాహ్మణులపై చాలా అభిమానమును
కలిగినవాడు. నియోగిబ్రాహ్మణులకు ఉపాధి కల్గించడానికి ఎందుకూ ఉపయోగము లేకుండా కంసాలుల
ఆధీనములో ఉన్న భూములను ఇప్పించాడు. కృష్ణానదీతీరాన
ఉన్న భూములను కూడా గణపతిదేవుని నుంచి
గ్రహించి ఉపాధి లేని బ్రాహ్మణులందరికీ ఇప్పించాడు. వారికి మంచి మంచి సదుపాయాలను
కల్పించాడు. వేములవాడ భీమకవి అతను చేస్తున్న పనులను చూసి ఆనందించి పొగుడుతూ
చెప్పిన పద్యాలు.
సీ వీడెపో
దుష్టారి వీరమంత్రి కఠోర
భూధరంబులకు
దంభోళిధార
వీడెపో
కవిరాజు గాఢదారిద్ర్యాంధ
కారంబులడఁగించు
కమలహితుడు
వీడెపో
బహునీతి విద్యానిరూఢిచే
సురగురుగెల్చిన
శుభకరుండు
వీడెపో
చతురబ్ధి వేష్టితావనిఁ గల్గు
బహుమంత్రికుల
సార్వభౌమమూర్తి
ఈతఁడే
సర్వదేవతా ప్రీతికరుఁడు
ఈతఁడే
గోవరాట్కుల శీతభానుఁ
డని
కవీంద్రులు పొగడంగ నతిశయిల్లె
మంత్రి
జంభారి రామయామాత్యశౌరి
సీ తనకీర్తి
యాచంద్ర తారార్కముగ మంత్రి
కులులకు
గరిణీకముల నొసంగి
నతిథి
సంతర్పణమను దినంబు నొనర్చి
ఖ్యాతిగాహరిహర
ప్రీతిఁ జేసె
వర్ణాశ్రమాచార
నిర్ణయంబులనెల్ల
వేదోక్తరీతిగా
వెలయఁ జేసె
ఘనవిప్రవంది
మాగధ కవీంద్రుల నెల్ల
నగ్రహారములిచ్చి
యాదరించెఁ
నతడు
శ్రీగోపరాజా న్వయాబ్ధిచంద్రుఁ
డవఁగ
విలసిల్లెఁ దనపాటి ఘనులు వొగడ
మంత్రి
దేవేంద్రుఁడనఁగ స్వతంత్రలీల
మంత్రి కులహేళి రామయా మాత్యమౌళి
ఇదిలా ఉండగా వైదికులలో మూర్ఖబ్రాహ్మణులు
కొందరు అధికారదానము పరిగ్రహించాడని రామప్రధానున్ని ఎంతగానో విమర్శలు చేశారు. ఆ
మాటలు విన్న భీమకవి వారినుద్దేశించి చెప్పిన పద్యాలు
ఉ మానఘనుండు; బ్రహ్మకులమండనమూర్తి; పరోపకారి;
దు
ర్దానదురానముల్ గొనడు; తప్పడుస్వామి హితోపకారముల్
దీనులఁబోచు బాంధవ విధేయుడు డస్సియు
వేడబోడు తా
నూనిన వేడ్కతోడను నియోగికినిచ్చిన
దానమల్పమే!
భావము:
గోపరాజురామప్రధానుడు మంచి స్వభావము కలవాడు; బ్రాహ్మణకులానికి ఎంతో పేరు తెచ్చినవాడు;
అందరికీ సహాయంచేసేవాడు; ఆడిన మాట, చేసిన దానం (పంచదానాలు) వెనక్కితీసుకోనివాడు;
ఎల్లవేళలా తన అధికారి మంచినే కోరడం, అతనికి రాజకార్యాలలో సహాయపడ్డం మరువనివాడు;
పేదవారిని తన బంధువుల వలె, స్నేహితుల వలె అవసరాలలో ఆదుకొనేవాడు; విధేయుడు; ఒకరిని యాచించడు. తనను
వేడుకొన్న వెంటనే నియోగిబ్రాహ్మణులకు చేసిన దానము గుర్తించడగినది కాదా?
ఉ వ్రాయుట చిత్రమా! వికృత వైదికమా! నిజదార
రక్షణో
పాయముకై నియోగి యిల బార్ధివ సేవ
యొనర్చినంతనే
పాయునె వంశ శీలములు? పాయకయెప్పుడు చిత్రగుప్తుడున్
వ్రాయడె యెల్ల లోకముల వారలు సేసిన
పుణ్యపాపముల్,
భావము:
అనామతునిగా దాచబడి, ఎందుకూ నోచుకోని సంపదను కాపాడి, సద్వినియోగము చేయాలన్నమంచి ఆలోచనతో నియోగిబ్రాహ్మణులకు ఉపాధి కోసం వినియోగిస్తేదాని
వలన కులగౌరవము చెడిపోతుందా? అతడు కీర్తి హీనుడవుతాడా? ఇలా చెప్పడం భావ్యమా? ఇది తప్పు అని వేదాలలో చెప్పారా? లేదు కదా?
ఎవరు గుర్తించకపోయినా, తప్పు పట్టినా అందరి పాపపుణ్యాలు వ్రాసే చిత్రగుప్తుడు మాత్రం అతని పుణ్యకార్యాలను గురిస్తాడు. ఎప్పటికీ
చెరిగిపోకుండా వ్రాస్తాడు.
పావులూరి మల్లన భీమకవికి సమకాలికుడు. ఇతని
గురించి భీమకవి చెప్పిన పద్యాలు
సీ ఆందోళికంబునం దతిరహస్యంబుగాఁ
జాపఱాయిని
బెట్టఁజాటినావు
జలనిధిలోతు లెక్కలచేతగన్గొని
యద్దఱిద్దఱియొడ్ల
కరిగినావు
మూసినబండిలో మునిగియుండెనని తెల్పి
ఱేనికిఁగోపంబు
ఱేచినావు
గాలిచేనల్లాడు కాగడాచుట్టలో
గద్యాణములమూటఁ
గాంచినావుఁ
గణితశాస్త్రంబురచియింపఁ గల్గినావు
పతిని మెప్పించి గ్రామముల్వడసినావు
తలఁవనీసాటి మంత్రులిద్ధరనుగలరె?
మహితగుణవార! శివ్వన మల్లధీర.
వాసుదేవభట్టరకుడు
భీమకవిని సత్కరించినంత గొప్పగా గణపతిదేవుడను రాజు తనను సత్కరించలేదని భావించి “కాలమహిమ
కాకపోతే! కల్లబొల్లిమాటలతో కవిత్వమల్లే కవులను సత్కరించిన విధంగా సకల
విద్యాపరిపూర్ణుడైన పండితున్ని సత్కరించట్లేదని చెప్పిన పద్యము.
సీ అవగతశబ్ద శాస్త్రచయులైన మహాత్ములు
పండితోత్తముల్
భువనతలంబునం
దధిక పూజ్యులు; వారిటులుండఁ గూటికై
నవనవకల్పనావిధి
చణత్వముదోఁపనబద్ధమాడు నీ
కవులిల
దాన పాత్రులయి గౌరవమందుట చూవెచిత్రముల్
భావము:
వ్యాకరణశాస్త్రములో పరిపూర్ణజ్ఞానం కలిగిన మహాత్ములు, గొప్పపండితులు ఈ లోకాన గొప్పగా
పూజింపదగినవారు. వారిని వదిలేసి, పొట్ట నింపుకోవడం కోసం క్రొత్త క్రొత్త కల్పనలు
చేస్తూ పొగుడ్తలతో పిండి, అబద్ధమాడే కవులను ఈ లోకములో అధికంగా పూజిస్తున్నారు. సత్కరిస్తున్నారు.
అధిక గౌరవమును పొందుతున్నారు. ఎంత విచిత్రమో చూడండీ!
సమాధానంగా
భీమకవి చెప్పిన పద్యము
చ కవి
కమలాసనుండు; త్రిజగత్పతియైన పినాకపాణియున్
కవియె
తలంపగాఁ గవులు కారె పరాశర బాద రాయణుల్
కవికృతపుస్తకగ్రహణ
గర్వితులల్పులె? పూజలందగాఁ
గవులట!
దానపాత్రులట కారట! యిట్టి విపో విచిత్రముల్!
భావము:
కవియే బ్రహ్మదేవుడు (బ్రహ్మ తన ఊహాశక్తిని
పదునుపెట్టి మన తలరాతలు వ్రాస్తాడు. అలాగే కవి కూడా తన కల్పనాశక్తిని రంగరించి సత్కావ్యాలను
వ్రాస్తాడు కావున కవి బ్రహ్మ దేవునితో సమానము). ఆలోచిస్తే కవియే ముల్లోకపాలకుడు,
త్రిశూలధారి అయిన పరమేశ్వరుడు(లయకారకుడైన పరమేశ్వరుడు ఈ జగన్నాటకములో మనలను ఆడించి
నడిపిస్తాడు. కవి కూడా తన కావ్యాలలోని పాత్రలను ఆడించి ముందుకు నడిపిస్తాడు కావున
కవి పరమేశ్వరునితో సమానము). పరాశర మహర్షి, వ్యాసుడు కవులే కదా! అంతటి గొప్పవారైన కవులు
రచించిన పుస్తకాలను అంకితము పొంది సంతోషించే వారు అల్పులా! వారి నుంచి
పూజలందుకోవడానికి, సత్కారములు పొందడానికి కవులు అర్హులు కారా! వినడానికి ఎంత
విచిత్రంగా ఉంది!
శ్రీరాముని
చరితమైన “శతకంఠ రామాయణము” అనే చక్కని ప్రబంధము నుంచి సంగ్రహించిన ఒక పద్యము.
చ.
హరుడధికుండు వింటికిఁ బురాఁతకుకంటెఁ గిరీటి మేటి
శం
కరపురుహూతనందనుల కంటెను రాముడు
నేర్చు నిందు శే
ఖరకపికేతుభార్గవుల కంటె
గుమారుఁడు మీఱు నంబికా
వరనరజామదగ్న్యశిఖిల వాహు
కెక్కుడు రాఘవుండిలన్
భావము:
ఉ వారక
వారకామినుల వర్తులచారుకుచోపగూహముల్
కోరక
కోరకోల్లసిత కుంజములఁ జిగురాకు పానుపుల్
చేరక
చారుకేరళ కళింగ కుళింగ నరేంద్ర మందిర
ద్వార
విహారులై సిరులనందక నందకపాణి కొల్వరే
భావము:
ఎన్నటికీ స్త్రీ సౌఖ్యమును కానీ, సుఖమయమైన, విలాసవంతమైన జీవితమును కానీ కోరుకోకుండా,
రాజాస్థానములను చేరి సిరిసంపదలను ఆశింపకుండా, ఎల్లవేళలా నందకపాణి అయిన శ్రీరామున్ని కొలవండి.
ఒకప్పుడు నల్లసిద్ధిభూపాలుడి సామంతరాజైన
రాజరాజు స్వతంత్రుడు కాదలచి కప్పమును చెల్లించకుండా యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ
యుద్ధాన నల్లసిద్ధిభూపాలుడికే విజయము
సిద్ధించింది. రాజరాజు నుంచి యుద్ధానికి అయిన వ్యయానికి గాను 40 లక్షల గద్యాణములను
తీసుకొని తరిమితరిమి కొట్టాడు. భీమకవి ఈ విషయాన్ని ఇలా ఈ క్రింది పద్యములో
చెప్పారు.
ఉ వాండిమి
నల్లసిద్ధి జవల్లభుడోర్చిన రాజు భీతుడై
యాండ్రన
గానకుండ వృషభాంకముఁ బెట్టుకొనంగఁ జూచితో
నేండిది
యేమి నీవనుచు నెచ్చెలులెల్లహసింప నంతలో
మూండవ
కంటితోడి దొరమూర్తి వహించిన మ్రొక్కిరంగనల్
భావము:
నల్లసిద్ధిభూపాలుడు ఓడించిన రాజరాజు, భయకంపితుడై, ఎవ్వరికీ కానరాకుండా వృషభాంకమును(ముఖము
కనపడకుండా) ధరిస్తుండడం చూసిన అతని నెచ్చెలులు “ఏమిటిది? ఏమిటి నీవు ఇలా?” అని పరిహసించగా,
అంతలో కోపంతో రాజరాజు తన ముఖమును చూపగానే ఆ నెచ్చెలులంతా భయపడి నమస్కరించారు.
భీమకవి ఒకనాడు చోడగంగును దర్శించినపుడు నన్నెచోడగంగు
కార్యదీక్ష, రాజభక్తి, పరాక్రమములను చూసి అతన్ని మెచ్చుకుంటూ చెప్పిన పద్యాలు
చ అని మొనజోడగంగడు మురారి బకారినరుండు
మాద్రిజుం
డన ఘన చక్రతోమర శరాసనకుంతము లల్కఁబూని వ్రే
యను వడిడాయనేయఁ బొడువన్ గళమస్తరవత్సమర్మముల్
తునియవె? నుగ్గుఁగావె? యెదదూరవె? నాటవె?
వైరివీరులన్
భావము:
చోడగంగు యుద్ధవ్యూహంలో శ్రీకృష్ణుడు, విలువిద్యలో అర్జునుడివలె భయంకరమైనవాడు, అతను కోపము వహించి తన
శరాసనకుంతము(ఒరలాగా బాణములుంచే చోటు)నుంచి తీసి బాణములు సంధించిస్తే ఆ వేగానికి
దుర్జనుల తల, కుత్తుక, అణువణువు ఖండింపబడవా? నుసికావా? శత్రువుల గుండెల్లో దూరిపోవా?
గుచ్చుకుపోవా?
భోజుడు
మంకు; ధర్మజుడు బొంకు; శచీపతి రంకు; కల్వపూ
రాజు
కళంకు; దైవత ధరాజము డొంకు; పయోధి యింకు; నర
భోజభవుండు
పంకు; ఫణిభూషణ దేవుడు సంకు; పద్మినీ
రాజ
హితుండు క్రుంకు; సరిరారు గుణంబుల నీకు ధారుణిన్
భావము:
పరాక్రమవంతుడైన భోజరాజు మొండిపట్టుదల కలవాడు కావున నిను పోల్చుటకు అతడు సరిరాడు.
ధర్మరాజు కురుక్షేత్రసంగ్రామమున “అశ్వర్ధామ హతః కుంజరః” అని అసత్యమాడి ధర్మము
తప్పిన వాడగుటచే ధర్మరాజు కూడా నిను పోల్చుటకు తగడు. శచీపతి ఇంద్రుడు
అహల్యాజారుడగుటచే నీకు సరిరాడు. కలువలరాజైన చంద్రుడు కళంకము(మచ్చ) కలవాడు కావున
అందమందు నీకు సాటిరాడు. మేరుపర్వతుడు క్రుంగి ఉండుటచే ధైర్యమున నీకు సరిరాడు.
సముద్రపునీరు ఇంకిపోయే గుణం కలిగినది కావున గంభీరమున నీకు సముద్రుడు సాటి రాడు. బ్రహ్మదేవుడికి
పంకించే గుణము ఉండుటచేత విద్యలో నీకు తీసికట్ట. శంకరుడు బికిరమడుగుకొనుట వలన ఇవ్వడమే కానీ యాచించడమే
ఎరుగని నిన్ను పరమేశునితో పోల్చతగదు. అస్తమించునపుడు సూర్యుని తేజము తగ్గిపోతుంది
కావున తేజము నందు పోల్చడానికి సూర్యుడు
కూడా సరిరాడు. గుణములలో ఈ భువిపై ఎవ్వరూ నీకు(చోడగంగుకు) సరిరారు. (అనగా చోడగంగు
గుణములందు పరిపూర్ణుడు. ఏ లోపం లేని వాడు అని అర్థము).
భీమకవి నన్నెచోళదేవుడు రచించిన
కుమారసంభవమును తిలకించి అతని గురించి ఈ క్రింది పద్యములను చెప్పారు.
చ రవికుల
శేఖరుడు; కవిరాజశిఖామణి; కావ్యకర్త; స
త్కవి;
భువినన్నుచోడుఁడటె! కావ్యము దివ్యకథఁగుమార సం
భవమటె!
సత్కధాధిపతిభవ్యుడు జంగమమల్లికారు నుం
డవిచలితార్థయోగధరుఁడటె!
వినంగొనియాడఁజాలదే!
క కలుపొన్నవిరులు
పెరుగఁ
గలుకోడిరవంబు
దిశలఁగలయఁగఁజెలఁగఁ
బొలుచునొరయూరికధిపతి
యలఘుపరాక్రముడు
టెంకణాదిత్యుడిలన్
సీ కుతలంబునిడుకొనఁ
గొలకొండగానిల్పి
శిరనిధిజొచ్చిరి
నగరసుతులు
మిన్నులపైఁబాఱుచున్న
యేరిలదెచ్చి
వారాశినించె భగీరధుండు
గోత్రాచలములెత్తికొని
వచ్చి కడచన్న
రత్నాకరముఁగట్టె
రాఘవుండు
జలధిమహీనతి
మొలమాలుగాఁ జుట్టి
పాలించెగరిగరికాలజోడు
వరుసనిట్లు
సూర్యవంశాధిపతులందు
నిధియ
మేరగాగ నిఖిలజగము
నేలిచనిన
వారికెనవచ్చు సుశ్లాఘ
ధనుడు
నన్నెచోళ జనవిభుండు
భీమకవి రాయనమంత్రి భాస్కరుని ఇంటికి వెళ్ళినపుడు తనకు ఒక గుర్రమును
ఇవ్వమని అడిగారు. అయితే అతను ఆలోచనలోపడి
ఎంతసేపటికీ తన అంగీకారము తెలుపని అతని పై చెప్పిన చాటువు.
క వగమాన్పి
యర్థికియ్యని
మగముండకు
మీసమేల మఱి మూతిపయి
దెగఁ
గొఱుగడాయె మంగలి
రగడందునఁ
గీర్తిదోచ రాయని బాచా!
భావం:
సంఘంలో ఎంతో పేరు మోసిన ఓ రాయనబాచా! సహాయం కోరివచ్చిన వాడి కష్టాన్ని తీర్చని
మగవాడు విధవతో సమానం. అటువంటి వాడికి మరి మూతిపయిన మీసము దేనికి? మీకు మంగలి సరీగా గొరుగుతున్నట్లు లేదు.
క చేకొని రాయన
బాచడు
కాకాలు గుణించు పిన్నకాలము నాడే
లా కేత్వమియ్యఁజాలడు
దాకునుగొమ్మియ్యఁ డిట్టిధన్యులు గలరే?
భావము: రాయనబాచడు చిన్నవయస్సులో కాకాలు
(అక్షరాలు) దిద్దేనాడే ‘లా’ కు ఏత్వమును (అంటే లే అన్న అక్షరమును) దిద్దలేదు. ‘దా’
అనే అక్షరానికి కొమ్మునూ (అంటే దు అన్న అక్షరము) దిద్దలేదు. ఇటువంటి ధన్యులు ఉన్నారా?
అంటే “లేదు” అను మాటను తన చిన్న కాలమునాడు అక్షరాలలో దిద్దనేలేదు. ఏనాడు అప్రయత్నంగా
కూడా తననోటి నుంచి లేదు అన్న మాట రాదు. ఆ మాటను ఊహ తెలియని వయసునుంచే దూరం
పెట్టాడు, అంత దానగుణము కలవాడని అర్థము.
క ఏవ్రాలైననువ్రాయును
నావ్రాయడు
వ్రాసెనేని నవ్వుచునైనన్
సీ
వ్రాసి తావడియ్యడు
భావజ్ఞుడురాయనార్య
భాస్కరుడెలమిన్
భావము: ఏ “వ్రా” లైనా వ్రాస్తాడు,
కానీ పరిహాసముకు కూడా “నా” వ్రాయడు ఆంటే “నావి” అన్న స్వార్థము లేని వాడు అని
అర్థము. సీ వ్రాసి “తా”కు వత్తు ఇయ్యడు. అంటే “వ్రాసి”స్తాడేకానీ, “వ్రాస్తిని”
అని అనే అహంభావము లేని వాడు అని అర్థము. ఈ జగతిలో ఎంతో దానగుణం కలిగిన వాడు మన
రాయన భాస్కరుడు.
ఉ ఒక్కడు
మంసమిచ్చె మఱియొక్కడు చర్మముఁగోసియిచ్చెవే
ఱొక్కరుడస్తినిచ్చె
నిఁకనొక్కడు ప్రాణములిచ్చె వీరిలో
నొక్కొక
పట్టునన్ బ్రదుకనోపకయిచ్చిరో? కీర్తికిచ్చిరో
చక్కగఁజూడు
మంత్రికులసంభవ! రాయనమంత్రి భాస్కరా!
భావము:
ఒకరు(శిబి చక్రవర్తి) తన మాంసమునే దానముగా ఇచ్చారు. మరొకరు తన చర్మము కోసి దానముగా
చేసారు. వేరొకరు(దధీచి) తన అస్తిక(వెన్నెముక)నే దానముగా ఇచ్చారు. ఇంకోరు తన ప్రాణములనే(బలి
చక్రవర్తి) దానముగా ఇచ్చారు. వీరిలో ఒక్కొక్క సందర్భంలో బ్రతుక ఇష్టం లేక ఇచ్చారో?
లేదా కీర్తి కోసము ఇచ్చారో? ఆలోచించు మంత్రికులమున పుట్టిన రాయనమంత్రి భాస్కరా! (రాయనభాస్కరుడు
ఎటువంటి కీర్తి ఆశించడనీ, పై చెప్పిన వారితో సరిసమానుడని భావము)
ఆయనభాస్కరుడు
మరనించిన తర్వాత ఆయన గురించి చెప్పిన చాటువులు
చ సహజకళంకమూర్తులు కుజాతులు గూఢతరోదయప్రభా
మహితులు గోత్రవిద్విషదమాత్యులు
రాత్రి చరానుకూలధీ
సహితులు మందవర్తనులు
సర్పసమానులు రాజసేవక
గ్రహములు కాననయ్యె నల
రాయనిభాస్కరుఁ డస్తమించినన్.
భావము:
భాస్కరుడు అనగా సూర్యుని తేజము లేక అణిగిఉన్న నీచగ్రహాలనేకము ఆకాశము మీద
కనపడినట్లే రాయనభాస్కరుడు మృతినొందగానే అదివరకు ఊరు పేరులేని నిర్భాగ్యులు కూడా
రాజాస్థానమునకు పోయి పెత్తనము చేయడము ఆరంభించారు.
దీనిని
బట్టి రాయన భాస్కరుడు గొప్ప రాజులవద్ద మంత్రియై రాజకార్యములను నిరుపమానముగా
నెరవేర్ఛి ఉన్నాడని అతడు పోవడము వలన ఈ లోకమున వెలితి కలిగినదని ఆధరించు వారు కరువై
ఆనాటి వారు ఎంతో బాధ పడినట్లు గ్రహించవలెను.
శ్లో. కృతేయుగే
బలిర్దాతా త్రేతాయాం రఘునందనః
ద్వాపరే సూర్యపుత్రశ్చ కలౌ
రాయనభాస్కరః
భావము: కృతయుగంలో దాత బలి చక్రవర్తి,
త్రేతాయుగంలో దాత శ్రీరాముడు, ద్వాపరయుగంలో దాత కర్ణుడు, కలియుగమందు దాత రాయన
మంత్రి భాస్కరుడు.
ఈ రాయనభాస్కడి కుమారుడు కొండనామాత్యుడు.
తండ్రిలాగా దానగుణసంపన్నుడు. ఇతని మీద భీమకవి చెప్పిన అద్భుత చాటువులు.
శా కాండావిర్భవ
భాండభూపరి వృఢగ్రైవేయ శైలేయసూ
కాండా
టాధిప కేతుమాతుల బలాకాశ స్రవంతీ మరు
త్కాండా
ఖండలతుండి పాండురయశః కర్పూర పేటీభవ
త్కాండా!
రాయనమంత్రి భాస్కరుని కొండా! దండనాధాగ్రణీ!
శా రెండానాల్కలు సాంప్రదాయకునికిన్ లెక్కింపగా నొక్కటే
గండాగొండి
శిఖండిబండనికి లెక్కల్లేని నాల్కల్ కదా
చండా రాతికులాట వీదహన తేజస్ఫార ధాటీల స
త్కాండా!
రాయనమంత్రి భాస్కరుని కొండా! దండనాధాగ్రణీ
క పద్యము
సెప్పిన సుకవికి
హృద్యముగా నొసఁగనట్టి
హీనాత్మునియా
పద్యము పామైకఱచును
ప్రద్యోదిత కీర్తికాండ!
భాస్కరుకొండా!
ఆవె పడుచునిడిన
వానిఁ బద్యమిచ్చిన వానిఁ
గడువుకిడినవాని
నడుపవలయు
నడుపలేనివాని
నయవిదులెంతురా
భువిని
భాస్కరేంద్ర పుత్ర! కొండా!
“అనారోగ్యం కలిగినపుడు వైద్యుడిని ఆశ్రయించాలి
లేదా భగవంతున్ని నిష్కల్మషమైన మనసుతో వేడుకోవాలి కానీ, ఇలా కల్లబొల్లి కబుర్లు
చెప్పే భూతవైదులను సంప్రదించి, వారి తప్పుడు మాటలను నమ్మవద్దని చెబుతూ ఈ పద్యాలను
రచించారు.
ఉ పోడిమి మంత్రముల్చదివి భూతములన్ వదలింతుమంచు నా
డాడను మోసగాండ్రు మృషలాడి ధనంబు
గడింపజూతు రీ
పాడుగుణంపు మానిసులఁ బాపుల చెంతకుఁ
జేరనీక పం
డ్లూడగ దౌడ వ్రేసినను నొందరు పాప మొకింత
యేనియున్
భావము:
లేని మంత్రములను సృష్టించి చదివి భూతములను వదిలిస్తానంటూ వచ్చి మోసగాళ్ళు, అబద్ధాలు
చెప్పి డబ్బు సంపాదిస్తారు. ఈ పాడుగుణమును కలిగిన మనుషులను, పాపులను దగ్గరకు చేరనీయకుండా
పండ్లూడబీకి దౌడ వేసినా ఒక్కింత కూడా పాపము కలుగదు.
ఉ చచ్చినవాడు భూతమయి శాతకఠోరకుఠార వేదనో
పచ్చలిత ప్రతీవ్రగతి బాధలుఁ బెట్టునటంచుఁ
బామరుల్
పిచ్చితలంపులన్ దవిలి భీతిలుచుండెదరీ
ధరాస్థలిఁ
జచ్చినవాని కెక్కడిది శక్తి? వివేకమునందుడీ
జనుల్
భావము:
ఈ లోకంలో మరణించిన వాడు భూతముగా మారి, పగబట్టి తీవ్రంగా బాధలు పెడుతున్నాడంటూ
పిచ్చి ఆలోచనలతో మూర్ఖులు కొద్దిగా భయపడుతారు. కానీ చచ్చిన వాడికి అంతటి శక్తి
ఎక్కడి నుంచి వస్తుంది? జనాలు వివేకము పొందరే?
మ కవిమాన్యుండు శపించెనేని యదియే
గాఢప్రయోగంబుగా
భువి నెవ్వారిని నాశనంబు సలుపుఁ
బుణ్యాత్ములౌ సజ్జనుల్
కవిసత్కార మొనర్చి సంపదలు భోగంబుల్
సౌఖ్యసంతానముల్
దవులన్ బొందుట దక్షవాటి కవిరాట్తత్వంబై
చాటించెడున్
భావము:
ఈ కవీమాన్యుడు శపించాడంటే, అది ఎవరినైనా తీవ్రప్రయోగముమై నాశనము
చేస్తుందని(అంటారు). సజ్జనులు నను సత్కరించి, ఆరాధించి పుణ్యాత్ములవుతారు. సంపదలు,
సుఖసంతోషాలు, సంతానాలకు అర్హులౌతూ పొందడము నాలోని ద్రాక్షారామ భీమేశ్వరుని స్వభావాన్ని
చాటిచెప్తున్నాయి కదా!.
చ అని మొనఁ గూలిపోమఱల నాయువొసంగితిఁ
దిక్కమంత్రికిఁ
గనికరమొప్ప సంపదల గంగునికిచ్చితిఁ
దొల్లి కోపముఁ
బెనఁగొని పోతరక్కసునిఁ బెట్టితి శాపముఁ
జచ్చునట్లుగా
ఘనుడను వేములవాడ కవి కాంతుఁడ భీమవర ప్రసాదుడన్
భావము:
ఘనుడను, వేములవాడన భాసిల్లే కవీశ్వరుడను, భీమేశ్వరవరప్రసాదుడనైన నేను యుద్ధములో
చనిపోయిన తిక్కనమంత్రిని మరలా బ్రతికించి ఆయువును ప్రసాదించాను కదా. కళింగగంగుపై
తొలుత కోపించినా, తర్వాత కరుణ కురిపించి, అతనికి సంపదలను ఇచ్చాను. పోతురాక్షసున్ని
మరణించే విధంగా శపించాను.
ఉ మానుగ బంధుకోటి నభిమానమునఁ దిలకింతుంగాని
లో
నూనిన కోపావేశమున నొప్పి శపింపగ
విఠ్ఠలయ్యకున్
బూని ప్రయోగమున్ సలుపఁ బూనితినం చపనిందఁ
జెందగా
లేనని సప్రమాణముగ లేఖినిముట్టి వచింతు
మాటికిన్
భావము:
విఠ్ఠలయ్యను ఆవహించేలా మంత్రప్రయోగము చేయబోయానంటూ అపనింద కలుగగా, బంధుకోటి నిజమైన
అభిమానమును చూస్తానే కానీ, మనసులో కోపావేశాలను దాచుకొని, నొచ్చుకొని తిట్టలేదనీ,
ప్రమాణపూర్వకముగా వ్రాసే కలమును తాకి మరలా మరలా చెబుతున్నాను.
Ø
భీమకవి
రాయనభాస్కరుని పై చెప్పిన పద్యాలు:
రాయన భాస్కరుడు మహాదాత,
ఎన్నోదానధర్మాలను చేసాడు. ఎంతో మందికి అగ్రహారాలను కట్టించాడు. ఎంతో మందికి
వివాహాలను చేయించాడు. అన్నదానము, వస్త్రదానము, గృహదానములనెన్నో చేయించాడు. ఎన్నో
సత్రాలను కట్టించి, ఉచిత అన్నదాన
వసతులను కల్పించాడు. ఈయన చేసిన
దానధర్మాలను వర్ణిస్తూ చెప్పిన
అద్భుతపద్యాలు.
క పసముత్య
మొకటి చాలును
గస వూడ్చిన చింపిరాలు గంపెం
డేలా?
రసికుం డొక్కఁడె చాలును
రసహీనులు పదువురేల రాయనిబాచా!
ఉ రాజితకీర్తిశాలియగురాయనిబాచ!
భవద్యశంబు ది
క్పూజితమౌచు మించె
సురభూధరభూధరభూధరేంద్ర కాం
తాజసుగోత్రరు గ్విధు
రథాంగరథాంగరథాంగ శేషభా
షాజలజాహితాహితతుషారతుషారతుషారధాములన్
ఉ ఏమనిలింపశాఖి?
పనియేమిసురేశ్వర! యీవి నిన్నుఁ జిం
తామణి మీఱినాఁడటకదా మన
రాయనబాచకోవిద
గ్రామణి;యౌన యింతటనె కాదుచుమీ
విభవంబునందు ని
న్నో మతియందు నీగురువునో
సుకుమారత నీకుమారునో
మ ఆయలక్ష్మీనిధి
రాయన ప్రభునిబాచామాత్యుఁడశ్రాంతమున్
నియతిన్ బ్రాహ్మణపూజసేయు
టభివర్ణింపగ శక్యంబె త
త్ప్రియ గ్రేహంబున
హేమపంజరమునన్ బె’ల్లర్చతప్రార్చత
ప్రియమేధా’ యనుచుం బఠించు
శుకశారీకిన్నరీద్వంద్వముల్
ఉ అన్నరొ
కొండపల్లి సచివాగ్రణి రాయనమంత్రి పట్టి బా
చన్నజలాన్నసత్ర మెడపైన పథంబునఁ
బెట్టు నెయ్యి రా
జాన్నము లొప్పుఁబప్పు పదియాఱు
తెఱంగులకూరగాయలున్
వెన్నెలగుజ్జుఁబోలుదధి
వేసవికాల మవారితంబుగన్
క ముసలాపెవ్రేలుఁజన్నుల
పసవంటిది లోభివానిబ్రదుకు
ధరిత్రిన్
బిసిబాలవయసువంటిది
రసికునిజీవనము
మంత్రిరాయనిబాచా!
సీ ఫణిరాజు
తనశిరోమణు లర్థికిచ్చునో
యనుచు విష్ణువు
క్రింద నణగియుండె
కైలాసకుధరమెక్కడ నిచ్చునో యని
యుగ్రుఁడక్కడఁ గావ
లుండఁబూనె
తనయందు మణుల నేతఱి నిచ్చునో
యని
వనధిసంతతమును
వణఁకుచుండె
సురధరాధరము నెవ్వరి కిచ్చునో
యని
తరణి యగ్గిరిచుట్టుఁ
దిరుగుచుండె
గీ ఔర!
నీదానవిఖ్యాతి యఖిలదిశల
మించివర్తించె నీకీర్తి
నెంచఁదరమె
గాఢదారిద్ర్య యామినీ
కాంతిచంద్ర
భాగ్యదేవేంద్ర!
రాయన భాస్కరేంద్ర!
సీ నీపంక్తినొకనాడు
నెఱిభుజించినవిప్రుఁ
డమృతాన్నమైనను
నరుచిసేయు
నీసభాస్థలి
నొక్కనిముసమున్నజనుండు
తల్పశేషునినైనఁదప్పుపట్టు
నీరూపమొకనాడు తేఱిచూచినభామ
కందర్పునైన డాకాలఁ
దన్ను
నీచేతిదానమ్ము
నెమ్మినమ్మినయర్థి
యెమ్మెధనాధిపుఁ
బొమ్మబెట్టు
గీ నీవె
నినుఁ బోలుదువు గాక నిన్ను నెన్ని
యున్నమంత్రుల నెన్నుట
పిన్నతనమె
బాలికాప్రాణ నూతన పంచబాణ!
భాస్కరేంద్రుని
రాయనభాస్కరేంద్ర!
క అక్షరాభ్యాసంబు శిక్షచేసెడునాఁడె
యోవ్రాసి
నా వ్రాయకుండినావు
గుణితవేళలయందుఁ గోరి
లాకేత్వంబు
దాకుఁ
గొమ్మియ్యక తర్లినావు
ఒకటి
పంక్తినివ్రాయు నూహ నేర్చిన నాడె
సున్నచుట్టక
వ్రేలు చూపినావు
గణితవేళలనాఁడె
ఘనయుక్తిగా నేర్పు
గురుకీర్తికిని
బాలుగూర్చినావు
తే నిజకులాచారధర్మంబు నిర్వహించి
హెచ్చు
గలయట్టిదాతవై హెచ్చినావు
సరసహృదయుండ
వినుకొండ శాసనుండ!
భవ్యభరతుండ!
రాయన భాస్కరుండ!
సీ సంగీత సాహిత్యసరసవిద్యల కిచ్చు
బహురూపులకు
నిచ్చుఁ బట్టు కిచ్చు
పెండ్లి
పేదల కిచ్చుఁ బేదవిప్రులకిచ్చు
బీదసాదుల
కెల్లఁ బిలిచియిచ్చు
తిట్టవచ్చిన
నిచ్చు దీవించఁగా నిచ్చుఁ
గొట్టవచ్చిన
నిచ్చుఁ గొంటె కిచ్చు
బాచన్న!
యననిచ్చు భాస్కరా! యననిచ్చుఁ
దేర
బాచా యన్నఁ దిరిగి యిచ్చు
గీ మెచ్చి తగ నిచ్చు మెచ్చులుమెచ్చి యిచ్చు
వీడువాఁ
డనకయె సొమ్ము వేడ నిచ్చు
మంత్రిరాయని
భాస్కరామాత్యుఁబోలఁ
గలరె
దాతలు మూడులోకములయందు?
సీ కదలియి
ల్వెడలంగఁ గడప కాల్ దాఁకినఁ
దలపాగ పందిటఁ
దగులుకొన్న
ఎందుఁబోయెద
వన్న నేకవిప్రునిఁ గన్న
నొంటిరోదన మన్న
నుండు మన్న
తగినచోఁ దుమ్మినఁ దంబళియెదురైన
వీడినతలవాని వీథిఁ
గన్న
ఒలిమిడిమిక్కిలి
యొంటికొమ్మెక్కినఁ
బులుఁగువీచినఁబొడపురుగుఁ
గన్న
గీ మాన
కేతెంచు నర్థిసమాజములకు
నిచ్చు నిష్టార్థవస్తువు
లెలమితోడ
సరసహృదయుండు వినుకొండశాసనుండు
భవ్యభరతుండు రాయనభాస్కరుండు
సీ అతిథికోట్లకు
నిల నమృతాన్నసత్రంబు
నంబలిసత్రంబు
నాతురులకు
ఆచార్యులిండ్ల రామానుజసత్రంబు
నూనెసత్రము
శిరస్స్నానమునకు
బాలకులకును నేర్పడఁ బాలసత్రము
కామసత్రము
విటగ్రామణులకు
జలకమాడుట కింట జల సృష్టి
సత్రంబు
తాంబూలసత్రంబు ధన్యులకును
గీ కట్టడలు
చేసె వినుకొండ పట్టణమున
సర్వకాలము సత్కారపూర్వకముగ
మంత్రి రాయనభాస్కరామాత్యుఁ బోల
గలరె దాతలు మూడులోకములయందు?
సీ నిత్యసత్యత్యాగనీతిలో
శిబిఁ జెప్పి
నినుఁ జెప్పి
మఱియును నినుఁ జెప్పి
బహుపరాక్రమమునఁ బరశురామునిఁ
జెప్పి
నినుఁ జెప్పి
మఱియును నినుఁ జెప్పి
రఘుకులోత్తముఁడైన రామచంద్రునిఁ
జెప్పి
నినుఁ జెప్పి
మఱియును నినుఁ జెప్పి
సుకుమారతను సరి సురరాజసుతుఁ
జెప్పి
నినుఁ జెప్పి
మఱియును నినుఁ జెప్పి
గీ చెప్పఁ
దగుఁగాక యితరులఁ జెప్పఁదగునె?
కలియుగంబున నీవంటిఘనుడు కలడె?
అమితగుణసాంద్ర!
మానినీకుముదచంద్ర!
భాగ్యదేవేంద్ర! రాయని
భాస్కరేంద్ర!
ఉ నన్నుతలీలఁ
బాండవులసంతతిఁ గర్ణుఁడు దాత గాక వా
రన్నలు దమ్ములందు నొక రైన
వదాన్యులు గారు; కీర్తిసం
పన్నునిరాయన ప్రభుని
భాస్కరుసంతతి నెంచి చూడ వా
రన్నలు దమ్ములింటఁ గలయందఱు
దాతలు భూతలమ్మునన్.
సీ ఏవేళఁ
జూచిన నిందిరానంద మై
యందమై చెలఁగు
నీమందిరంబు
ఏపాళఁ జూచిన గోపాలసత్కథా
ళిందమై చెలఁగు నీ
మందిరంబు
ఏజాముఁ జూచిన నిష్టాన్నభోజనా
ళిందమై
చెలఁగునీమందిరంబు
ఏప్రక్కఁ జూచిన సుప్రజానాయకా
ళిందమై చెలఁగు
నీమందిరంబు
గీ గాక తక్కినమంత్రివర్గములయిండ్లు
మేకమెడచండ్లు గిజిగాండ్ల
మెఱుగుగూండ్లు
పూవుఁబోఁడులు
నిర్మించుబొమ్మరిండ్లు
భవ్యవిభవేంద్ర! రాయని
భాస్కరేంద్ర!
సీ రంగత్కృపాదృష్టి
గంగాభవానికి
మణికంకణంబు లేమంత్రి
యొసఁగె
భిక్షార్థ మీయఁగా నక్షయంబగునట్లు
మార్తాండుఁ డర్థ
మేమంత్రి కొసఁగెఁ
దగ వేడినంతలో జగతిపై నర్థికి
మానంబుప్రాణ
మేమంత్రి యొసఁగె
మీసంబు తాకట్టువేసి పదార్థంబు
మహిమచే నర్థి
కేమంత్రి యొసఁగె
గీ అతడు
సందవరీకవరాన్వయుండు
దుర్ఘటుండు
వసిష్ఠగోత్రోద్భవుండు
శత్రుమథనుండు వినుకొండ శాసనుండు
భవ్యభరతుండు రాయనిభాస్కరుండు.
క వసుధేశుఁ
గొల్వరాదో
పసగలమణియంబు చేసి బ్రదుకఁగరాదో
రససిద్ధిఁ బడయరాదో
రసికుఁడు కారాదు గాక రాయన
బాచా!
క మీఁగాళ్ల
బంటినీళ్లకు
వీఁగుదు రమ్మక్క యనుచు వెరపున
వనితల్
చాఁగి పయోధులు దాటెను
రాఁగై నీకీర్తికాంత రాయని
బాచా!
సీ ఉత్తుంగ
భుజసూనుద త్తనందాపురీ
పుణ్యాగ్రహారాంశభోక్త
యితఁడె
ఆజన్మ సంసిద్ధభూజన ప్రఖ్యాత
దానసింహాసనాధ్యాసి
యితఁడె
కొండపల్లీరాజ్యమండలాఖిలమహా
గణకసందోహాగ్రగణ్యుఁడితఁడె
వైకుంఠతీర్థనిర్వాణసంయమికృపా
సంవర్ధితాఖిలైశ్వర్యుఁడితడె
గీ కొండవీ
డుద్దగిరి పెనుగొండ గుత్తి
పానుగ ల్విజయనగరపట్టణముల
యర్థులకునిచ్చు నితడె
యిష్టార్థ మనుచు
జగమురాయనభాస్కరుఁ
బ్రెగడఁబొగడు.
ఉ రాజతకీర్తి
శాలి యగు రాయనిభాస్కరు వేఁడబోవఁగా
నాజికి నిట్లనుల్ బరునియాలికి
నిట్లను నర్థికిట్లనుల్
దేజము పెంపులేని యతిదీనుని హీనుని
వేడఁబోవగా
నాజికి నిట్లనున్ బరునియాలికి
నిట్లను నర్థి కిట్లనున్.
నెల్లూరు వర్ణణ : నెల్లూరు పట్టణాన్ని వర్ణిస్తూ భీమకవి
చెప్పిన పద్యాలు
సీ పాలించు
నేవీట బ్రహ్మాదివంద్యుండు
లీల మూలస్థాన
లింగగురుడు
దీపించు నేవీట దేవాలయంబులు
ధావళ్య నవసుధా ధౌతములుగఁ
బ్రవహించు నేవీట బ్రహ్మాండ
కర్పరం
బొరసి మిన్నులు
ముట్టనున్న పెన్న
చెలువందు నేవీట జిరకాలజీవన
స్వర్ణాల చెఱ్వు
సంపూర్ణమగుచుఁ
గీ బ్రజలకును
నున్కి సకల సంపదలకున్కి
భోగములవీడు సురపతివురికి నీడు
నమ్మికలటెంకి వైరులఁ
జిమ్ముకొంకి
భాగ్యనికరంబు నెల్లూరు
పట్టణంబు
సీ ధీరుఁడై
యేలెఁ దిరుకాళ దేవుండు
తిక్కనాయకుఁ డేలెఁ
దేజమెసఁగ
మన్మసిద్ధనయేలె మహిమతో దీపించి
దాదినాగనయేలె
ధర్మరీతి
మనుగొండుగోపాల మనుజాధి పతి
యేలె
స్వర్ణ దేవుండతి
ప్రభగనేలె
గోపినాథుండేలె గుణపయోరాశియై
రమణతో
శ్రీరంగరమణుఁడేలె
గీ తిక్కనయు
మఱియిక కొన్నిదినము లేలె
నేలెమీతండ్రి మర్యాదలెల్లఁ
గలుగఁ
గడక నీవేలి తందఱకంటె మించి
శరధిగంభీర! సంగమక్ష్మాతలేంద్ర!
సీ ఏపట్టణంబున
నెన్నంగమున్నూట
యఱువది
దేవాలయంబులుండ
ఏపట్టణంబున రూపింపనన్నియు
నీరేడు
బావులింపారుచుండు
ఏ పట్టణంబుననెల్ల మానవులుఁ బ్ర
శస్తిఁగాంచిరి
నెఱజాణలనఁగ
ఏపట్టణంబుననే కాలమును చెన్ను
కాల్వలచేత
ముక్కాఱుఁబండు
గీ శివునికృపఁబుట్టె
వేమాల శెట్టి బావి
పరగజగమెల్ల నెఱుఁగనేపట్టణమున
నట్టి పట్టణమిలను
సౌఖ్యములకునికి
పట్టనందగు నెల్లూరు పట్టణంబు
సీ చరియించితినిగాని
జగముమూలస్థాన
పరమేశ్వరునివంటి
భక్తవరదు
వివారించితినిగాని వివిధభూములు
వల్లి
కొంటనాధునివంటి
కూర్చువేల్పు
పరికించితిని గాని బహు దేశము
లనంత
పద్మనాభుని వంటి
దివ్యమూర్తి
వీక్షించితిని గాని
విశ్వమంతయుఁ బెన్న
నదివంటి
దివ్యపుణ్యస్రవంతి
గీ అరిగితినిగాని
దేశ దేశాంతరముల
వేదగిరివంటి పావనోర్వీధరంబు
గాన నిన్ని విశేషముల్గలిగి
ధరఁబ్ర
సిద్ధికెక్కెఁద్రి విక్రమ
సింహపురము
నెల్లూరు పట్టణానికి
విక్రమ సింహపురము అను పేరు కలదు.
సీ ఆపట్టణంబున
సమరంగఁ దూర్పున
మాకందచందన మహితవనము
ఆ నగరంబున కటుదక్షిణంబునఁ
జెలువారు
వేమాల సెట్టిబావి
ఆ యూరి పడమట నంభోజరాజివేఁ
బ్రాకటంబైన తటాకమమరు
నొప్పారు నవ్వీటి
కుత్తరదిశయందు
మున్నీటి కనయైన
పెన్నఁదనరు
గీ కలిమి
నారాజధాని మార్గంబదెన్న
బహుళగంధర్వ సింధూర బంధురంబు
రతనపుం బొమ్మలప్పురి రమణులనఁగ
వినుతికెక్కెను నెల్లూరి
విభవమహిమ.
శా మల్లెల్
మొల్లలు సేమమా? శుభములామాకందముల్ జాజులున్
మొల్లంబారక యుండునా? సుదతులున్
మోదంబువాటింతురా?
విల్లుం గోలలు వెన్కకుఁ
మఱలునా? వేమాలనూయున్నదా?
నెల్లూరఁ బేదసోమ వీధిన కదా
నీరాక జై హితృ కా
నృసింహపురాణములోని
పద్యాలు కొన్ని
ఉల్లసిల్లుచు మేలిమి యొల్లమేటి
యబ్జగర్భుని ప్రోలఁ
బ్రత్యక్షమయ్యె
నింగిపయినుండి గట్టుల
గొంగ కడున్ రాలవాన గురియింపఁగ
నా
లం గాన ముకుందుఁడు దా
ల్చెం గోవర్ధననగంబు లీలగ నేలన్
క ఈ
క్షితికి వచ్చి వేగమ
ద్రాక్షారామమున వార తరుణులనృత్యం
బీక్షించి
యంతకంటెను
దక్షణమున నేర్చి రంభతగ వేర్పడగన్
చ శ్రుతిమత
ధర్మయోగములు చోద్యపుమూల్యములప్పురంబునఁ
జతురతఁ బుణ్యవస్తువులు
సారవిముక్తి వదంబు లమ్ము వా
రతులిత విఘ్న శాసన సమాహితులైన
మహాత్ములందితో
ద్ధతిఁ గొనువారు మీసువిహితవ్రత
పారగులైన బోధనుల్.
తే.గీ అదరుపాటున
వెసనిచ్చి పొదివికొనిన
దొలగిపోవఁ గూడక యుండి మలయపవనుఁ
డిందుఁ దలదూర్చుకొనియెనో
యిప్పుడనఁగ
నమరుఁ దాళవృంతముల మందానిలంబు!
తే.గీ పొదవియొండొండ
దివియును భువియు దెసలుఁ
బొదవికొని యుండు చీకటి
ప్రోవువలన
మిక్కుటంబుగఁ గాటుక
గ్రుక్కినట్లు
కరవటంబున జగదండ ఖండమమరె
క అది
యట్ల కాదె నిప్పునఁ
జెదలంటునె దేవ దేవు
శ్రీరమణీశుఁ
మదినుంచుకొన్న వానిని
బొదవునె యాపదలు? దవినిఁ
బొందునె తమమున్
ఉ శ్రీ
స్తవకుంకుమద్రవ నిషిక్త భుజాంతరభాగ విస్ఫుర
త్కౌస్తుభ నూతనార్కరుచి
గర్వితనాభిసరోజ సౌరభ
వ్రస్తుత మత్తభృంగవర
రాగరసోల్పణ భోగిభోగ త
ల్పాస్తరణుందలంచు సుకృతాత్ముల
పాస్త సమస్త కల్మషుల్
చ కడిఁది
వరంబు వారిరుహగర్భునిచేఁ గొనినాడు వాడు మీ
యెడ ననిశంబుఁ బెన్బగయు నీనును
దోషము నెమ్మనంబులో
జడిగొని యుండుఁ గావున నసాధ్యుఁడవధ్యుఁడు
దైత్యనాధుడే
వడువునఁబౌరుషంబుఁగొని
వానిజయించుట వ్రేగుచూడగన్
తే.గీ పొగడమ్రాకుల
మొదలను బుష్పరసము
తొరగి నెత్తావియందున
నెరయనొప్పెఁ
బూచు కొఱకుసు మున్ను నింపులు
దలిర్పఁ
గడగి వనలక్ష్మి యుమిసిన
కళ్ళయనగ
మ ధరణీమండలి
దిర్దిరం దిరిగెఁ బాతాళంబు ఘూర్ణిల్లె ని
ర్జరనాధ ప్రముఖాఖిలామర నివాస
శ్రేణులం దోలిమై
నెరయుఁ బంకజ సంభవాలయమునఁ నిండా
రె నెవ్వేళ శ్రీ
కర దైతేయ తనూభ వోద్భవకథా
కల్యాణ ముద్ఘోషమై
క మీఱీన
మౌనుల కినుకకు
మాఱలుగక యున్న మీసమగ్రక్షమవే
మాఱుఁగొని యాడఁగా దగు
గీఱునె సాత్వికుల బుద్ధిఁ
గిల్బిషచయముల్
క వేదములాదిగఁగలయ
ష్టాదశ విద్యలకునీవ స్రష్టవుత త్త
ద్బోధకులును భవదాజ్ఞా
పాదకులు సమస్త ధర్మపాలన చతురా.
క మానవనాథుడు
గంగా
స్నానానంతరము సకల దానములు మహా
దీనులగు విప్రకోటికి
సేనాదయతోడనిచ్చి శివుసేవించెన్
భీమకవి హరవిలాసం అను ఒక గ్రంథమును
రచించాడు. శ్రీనాథుడు రచించిన హరవిలాసం తప్ప భీమకవి రచించిన హరవిలాసం లభించలేదు. భీమకవి
హరవిలాసంలో రెండు పద్యాలు మాత్రమే
లభించాయి.
ఎంతయును దుస్తరంబు దు
రంతరసంసారవారి రాశి యది వెసన్
గంతుగొను మానవుండొక
యింత శివస్మరణ చేసి యేచిన భక్తిన్!
భువిలో మిత్రుండగు వాఁ
డవిరతమును వేఱు లేక యాత్మీయమహో
త్సవముఖకృత్యంబులన
ధ్యవసాయం బెఱుకపఱుపఁదగు సంప్రీతిన్
శతకంఠరామాయణం లోనివి:
క భువిఁ
బుట్టి పీచమడఁచెను
దివిజారాతుల దినేశ దీప్తులడర
రా
ఘవుఁడనుచు మునులు వొగడిరి
దివిని దివౌకనులు మిగుల
దీవించి రొగిన్
చ కలగకుఁడీ
నభశ్చరులు కంపము జెందకుఁడెప్దు గిన్నరుల్
తలకకుఁ డచ్చరల్ మునులుఁ
దత్తరమందకుఁ డేను వచ్చి మీ
యల జడులెల్లఁ బాపి మిమునందఱఁ
గాచెదనంత వట్టు మీ
గలిబిలిమాని యుండుఁడని
కైటభమర్దనుఁ డెల్ల భంగులన్
సీ.
అబ్జగర్భశివస్వరాఢ్యపూజ్యపదాబ్జ, కమలాక్షమౌనివర్గప్రసన్న
వైభవాఖండదేవాది దేవకృపాబ్ధి, యఖిలదిక్పాలకప్రాదినిలయ
నుత పుణ్యహాస బిందుయుతాననాంభోజ,
యతిదయాప్లృతినిజాత్మా మహాత్మ
స్వచ్ఛపౌరుషకీర్తిసంయుక్త సంచార, మహిమ నెక్కటి
యైనమాన్యచరిత
గీ పోల్ప
నీపోలికకు దైవములును గలరె, సరసనుతిపాత్ర భక్త రంజన చరిత్ర
ప్రాసనిర్భిన్న చండతరాసురేంద్ర, యలఘుయతిగణ్య రఘురామ
యఘవిరామ
భీమకవి సాహిణిమారుడి పేరున చెప్పిన
పద్యాలని కొన్ని కనపడుతాయి. కానీ ఆ సాహిణి
మారన, చొక్కభూపాలుని ప్రార్థన మేరకు కదనరంగమున తుదముట్టించిన సాహిణి మారడా? లేదా
వేరేవాడా? అనేది తెలియరాదు.
పద్యాలు:
క అప్పులిడు
నతడు ఘనుడా
అప్పుడొసగి మఱలఁ గాంచునాతడు
రాజా?
చెప్పగవలె సాహిణిమా
రప్పను దానమున ఘనుడు
రాజునటంచున్!
భావము:
అప్పుగా నీళ్లిచ్చే మేఘుడి కంటే, తన కళలు ఇచ్చి తిరిగి స్వీకరించే చంద్రుడి కంటే
దానములో సాహిణి మారప్పే గొప్పవాడు.
క మాటాడరాదు
సభలన్
మాటాడినఁ దప్పరాదు
మగసింగముకున్
మాటయె మానము కాదా
పాటువుగల వారికెల్ల సాహిణిమారా!
క ఇంతుల
మనముల నరిసా
మంతుల మనములను బుద్ధిమంతుల మదిలోఁ
జింతింపని బ్రతుకేటికి
సంతత సత్కీర్తి హారా
సాహిణిమారా!
29. భీమకవిని
స్తుతించిన కవులు
·
శ్రీనాథుడు
తన “కాశీఖండం”లో తన పూర్వకవులను స్తుతిస్తూ, మొదటగా భీమకవి ఉద్దండశైలిని
గుర్తుకుతెచ్చుకున్నాడు.
“ వచియింతు వేములవాడ భీమన భంగిఁ
నుద్దండలీల నొక్కొక్క మాటు
భాషింతు నన్నయభట్టుమార్గంబున
నుభయభాషాప్రౌఢి నొక్కమాటు”
·
పట్టపు
సరస్వతీ సోమయాజి (సాక్షాత్తు భీమేశ్వరుడు భీమకవి నాలుక చివర వాగ్భామిని
బీజాక్షరాలను లిఖించాడని)
భీమేశ్వరు డితడు మా
నామము వాడనుచు వ్రాసి
నాలుకతుద వాగ్భామిని
బీజాక్షర మా భీమన
దలచినను గల
వభీష్టఫలంబుల్ (పృథుచరితము)
·
తిరువేంగళ
కవి తన “చొక్కనాథచరిత్ర” గ్రంథములో తెలుగు కవులను స్తుతిస్తూ భీమకవి ని తొలుత తలచి
తరువాత కవిత్రయాన్ని తలచాడు.
“
భవభూతి దండుమాఘునిని బిరుద వేములవాడ భీము,
నన్నయ
తిక్కన ఎఱ్ఱపార్య శ్రీనాథునిలఁగల్గు కవులను నెల్ల
సద్భక్తి విలసిత సద్వాక్య
వినుతి నుతించియెకతి రచియింప”
·
కొరవి
గోపరాజు అను కవి భీమకవిని (బలభీముడు, వినుత భీముడు) గూర్చి
“వేములవాడక సుఖియై
వేములవాడం జరించి
వేములవాడన్
దా మెరసిన భీముని
సుత
భీముని బలభీము
విముఖతభీముదలంతున్”
·
ఆంధ్రకవి
రామయ్య (భీమకవి ఛందోనిబంధన చాతురీ ధోరేయుడని, వాగ్ధాముడనీ)
“ఛందోనిబంధన
చాతురీధోరేయు వాగ్దాము
వేములవాడ
భీము”
“చను నుత్తమగండాధ,ర్వణహనుమదనంతన కవిరాక్షనజయదే
వనుత శ్రీధరగోకర్ణనీలకంఠాది భీమన చ్ఛందంబుల్”
·
వెల్లంకి
తాతంభట్టు (భీమకవి లక్షణకర్త)
“భీమన అఖండంబు
మొదలైన కొన్ని వళులకు
లక్షణ లక్ష్యంబులు
చెప్పడు”
ప్రజ్ఞాలవదుర్విదగ్దు
లసంగతంబుగా బెనచి
తగిలించినా; రతని
యంకితంబు లేవున
వానిం
బ్రమాణింపతగదు”
·
చంద్రరేఖావిలాప
రచయిత కూచిమంచి జగ్గకవి (తిట్టు కవిత్వం అనగా అందులో భీమకవి అగ్రగణ్యుడని
చెప్పాలని)
భీమకవి
రామలింగని
స్త్రీ
మన్మధుడై చెలఁగు శ్రీనాధకవిన్
రాముకవి
ముఖులను ర్రొ
ద్ధామగతిఁ
జిత్తువీధిఁదలచి కడంకన్
·
పెదపాటి
సోమనాథుడు రచించిన అరుణాచలపురాణంలో భీమకవిని ఇలా తలచాడు.
వాక్ప్రతోషితదక్షవాటి
మహాస్థాన
భీము
వేములవాడ భీముఁగొలిచి
·
మొల్ల
స్తుతగుణోద్ధాము
నాచనసోము భీముని
·
పింగళి
సూరన్న భీమకవి రచించిన రాఘవపాండవీయం అను రెండర్థముల కావ్యం దొరకకపోవడం వలన అలాంటి
కావ్యమును అదే పేరున రచించాడు. ఆ గ్రంథములో మొదటి పద్యాన ఇదే విషయాన్ని ఇలా వ్రాశాడు.
ఉ భీమన
తొల్లి చెప్పెనను పెద్దల మాటయె కాని యందునొం;
డేమియు నేయెడ న్నిలుచు టెవ్వరు గాన రటుండనిమ్ము నా,
నామహిత ప్రబంధరచనా ఘనవిశ్రుతి నీకుఁ గల్గుటన్,
నామదిఁ దద్ద్వయార్థ కృతి నైపుణియుం గల దంచు నెంచెదన్
·
చిత్రకవి
పెద్దన (భీమకవి ఈశ్వరప్రసాది కవితాడ్యుడని)
ప్రత్ర్యక్ష
వర ప్రసాదకవితాడ్యుని
వేములవాడభీమునిన్
·
లింగముగుంట
తిమ్మన
భీమనయు ననంతయును బెద్దనయును
తాతానయును జెప్పినట్టి ఛందములు
గూర్చి
ప్రకరణము లొప్పజేసెను
బ్రహ్మసంఖ్య
నొనర లింగముగుంట తిమ్మన యనుకవి
·
పొత్తపి
వెంకట రమణ కవి
భీముని
ఫణబంధపేశలంబు
·
వార్తకవి
రాఘవయ్య
“జనతతగణయుతము సంపత్కరంబుగా
మంచి దనుచు భీము డెంచినాడు”
“ఛందం మొదలనే వేములవాడ భీమ
కవిగారి ప్రయోగం ఉన్నది”
·
కాకునూరి
అప్పకవి
“వికటకవులు కొన్ని వింతలు
గల్పించి
కవిజనాశ్రయమున గలిపినారు. వాని
కొనంగ
వలదప్రయుక్తంబు లేల సెప్పు
భీముడెరిగి యెరిగి”
భావము:
కొంతమంది వికటకవులు స్వీయములయిన కొన్ని వింతలను సృష్టించి వేములవాడ భీమకవి రచితమగు
కవిజనాశ్రయమున చేర్చి వేసిరి. వాటిని స్వీకరించతగదు. ప్రామాణికుడగు భీమకవి తెలిసి
తెలిసి ఇట్టి అప్రయుక్తములను చెప్పియుండదు. మనకు కభించిన లక్షణగ్రంధములలో
కవిజనాశ్రయము ప్రాచీనమైనది. దీనిని వేములవాడ భీమకవి రచించెను.
“ కవిజనాశ్రయమున
‘శ్రీకాంతా’ యని వేములవాడ
భీమకవియును”
“భీమన పది చెప్పె ననం
తామాత్యుడు చెప్పె వెనుక యతు
లిరువదినా
ల్గా మీద గొందఱు కవి
గ్రానణు లిరువది యునేడు
గావించి రొగిన్
భావము:
భీమకవి కవిజనాశ్రయమను ఛందమున 10 యతి భేదములను,
అనంతామాత్యుడు ఛందోదర్పణమున 24 యతి భేదములను, ఆ పైన కొందరు కవిశ్రేష్ఠులు
27 యతి భేదములను చెప్పిరి
·
ఓరుగంటి
రామకవి
భీమేశ్వర లబ్ధకవితావాచా
సిద్ధిగల వేములవాడ
భీమనార్యుం డొనరించిన
కవిజనాశ్రయం
బను ఛందంబు (కవితాలక్షణసారం)
·
కూచిమంచి
తిమ్మకవి
భీమన చెప్పిన పది యతులను ప్రకారాంతమున వ్రాసుకొన్న పద్యమే
ఉంది.
·
కస్తూరి
రంగకవి
ఆదిమకవి భీమన రేచన మీదనంకితముగా జెప్పినాడు.
·
పిండిప్రోలు
లక్ష్మణకవి
పృథు కుకవి
స్వాంభీము భీము దలచి
·
కట్టమూర్తి
కామేశ్వరకవి
రమణీయపాకాభీరాము భీము దలచి
·
శేషధర్మము
లక్ష్మణకవిస్తుతి
భీము ననంతు జిత్రకవి పెద్దన సుధీంద్రు జగత్ప్రసిద్ధులన్
·
అనంతామాత్యుడు
తన భోజరాజీయము అను కావ్యమునందు
నన్నయభట్టుఁదిక్కనకవి
నాచనసోముని భీమనార్యుఁ బే
రెన్నిక
జిమ్మపూడియమరేశ్వర భాస్కర శంభుదాసునిన్
నన్నుతిఁజేసివాక్య
సరసత్వము వీనులకింపు మీర న
త్యున్నతిగా
నొనర్తు నెఱ యోధులమేలనఁ గావుమిమ్ములన్